తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైందా..?

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైందా..?

IPS officers to be transferred in Telangana : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. కొత్త ఏడాదిలో రావాల్సిన ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీంతో పోలీసుశాఖలో జనవరి నెలలో బదిలీలు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయ్.

రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయ్. ఇప్పటికే కొందరు అధికారులకు ప్రమోషన్లు వచ్చినా.. బదిలీలు మాత్రం జరగలేదు. రెండేళ్లుగా పోలీసుశాఖలో పోస్టులు భర్తీ కాకపోవడం, ప్రమోషన్లు వచ్చినా అదే పోస్టుల్లో కొనసాగుతుండటం ఐపీఎస్‌లలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీలుగా ప్రమోషన్ వచ్చింది. అడిషనల్ జనరల్స్‌గా ఉన్న పూర్ణచంద్రరావు, గోపీకృష్ణలను డీజేపీలుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికలతో అధికారులకు బదిలీల మోక్షం కలగలేదు. ఈ ఏడాది కరోనా వల్ల అధికారుల బదిలీపై హోంశాఖ ఆసక్తి చూపలేదు. 2020లో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు రిటైర్‌ కాగా.. ఇద్దరు కేంద్ర సర్వీసులపై వెళ్లిపోయారు. కొత్తగా 11మంది ఐపీఎస్‌లు రాష్ట్రానికి వచ్చారు. పలువురు సీనియర్ ఐపీఎస్‌లు పదోన్నతి పొందినప్పటికీ ఎక్కడివారు అక్కడే ఉన్నారు. ప్రమోషన్ వచ్చినా కూర్చిలు మాత్రం మారలేదు. దీంతో వాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

లాక్‌డౌన్‌ తర్వా పలువురు అడిషనల్‌ ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. కానీ, జిల్లాలు, కమిషనరేట్ల బాసులను మాత్రం కదపలేదు. దీంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పలు విభాగాల చీఫ్‌లపై పనిభారం ఎక్కువగా ఉంది. దానిని గుర్తించిన ప్రభుత్వం బదిలీల ఫైలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆ ఫైలు సీఎం వద్దకు వెళ్లినట్టు అధికారుల సమచారం. సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంట పోలీసు శాఖలో నెలకొంది.