రైల్వే టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం…IRCTC వెబ్ సెట్ పై హెవీ లోడ్

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 10:56 AM IST
రైల్వే టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం…IRCTC వెబ్ సెట్ పై హెవీ లోడ్

సోమవారం సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభం కానున్న ప్యాసింజర్ రైళ్లకు బుకింగ్ ప్రారంభమయింది. అయితే అధికమైన రద్దీ కారణంగా ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్ సైట్ irctc.co.in లోడ్ అవడంలో ఫెయిల్ అయింది. అయితే కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. 6గంటల నుంచి రైలు టిక్కెట్ల బుకింగ్ అందుబాటులో ఉంటుందని ఇండియన్ రైల్వే తెలిపింది. మంగళవారం ( మే 12) నుంచి 15 జంట రైళ్లను (అప్ అండ్ డౌన్ 30 రైళ్లు) ప్రారంభించాలని రైల్వే శాఖ ఆదివారం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి బుకింగ్ ప్రారంభమయింది.

న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హవ్డా, పట్నా, బిలాస్పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడవనున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. IRCTC వెబ్ సైట్ ద్వారానే ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రైల్వేస్టేషన్లలోని టికెట్ల కౌంటర్లు మాత్రం తెరుచుకోవు. కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కోసం ప్రయాణికులు కనీసం గంట ముందుగా స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు. టికెట్లపై ఎలాంటి రాయితీలు ఉండవు. 

మరోవైపు,దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సాధ్యమైనంత ఎక్కువ మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్ల సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ప్రత్యేక సోషల్ డిస్టెన్స్ నిబంధనలో భాగంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంచుతూ వస్తున్న మధ్య బెర్తులను కూడా ప్రయాణికులకు కేటాయిస్తామని తెలిపారు. ఒక రైలులో 24 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 72 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇప్పటివరకు సుమారు 5 లక్షల మందిని రైల్వే శాఖ వలసకార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసింది.

Read More:

శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

12 నుంచి 15 రైళ్లు ప్రారంభం.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే?