వాహనం నడిపే వ్యక్తి తాగి ఉన్నాడా ? మీరూ బుక్ అవుతారు..నయా రూల్

మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ?

వాహనం నడిపే వ్యక్తి తాగి ఉన్నాడా ? మీరూ బుక్ అవుతారు..నయా రూల్

Cyberabad

driver drunk : ప్రమాదాలు జరుగకుండా చూసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మద్యం తాగి రోడ్డెక్కడం మూలంగా ప్రమాదాలు అధికం అవుతున్నాయని గుర్తించిన పోలీసులు కఠిన చర్యలు తీసుకొనేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలను నడిపే వారిపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు..ఇకపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

‘మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ? అయితే అతనితో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’. అంటూ హెచ్చరించారు. ఇందుకు మోటార్ వాహనాలు చట్టం 1988, సెక్షన్ 188 ఉందని వెల్లడించింది.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు గుడ్ అంటూ కామెంట్స్ చేస్తుండగా..మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. సర్‌.. ఇది ద్విచక్ర వాహనాలకు కూడా వర్తిస్తుందా ? కేవలం 4వీలర్స్‌కేనా ? ఎందుకంటే మద్యం తాగిన వారిని బైక్‌ వెనకాలే కూర్చోబెట్టుకుని మరొక్కరు డ్రైవ్‌ చేస్తుంటారు. క్లారిటీ ఇవ్వగలరు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘సార్, ఇది ద్విచక్ర వాహనాలకి కూడా వర్తిస్తుంది. బండి నడిపే వ్యక్తి, తాగి ఉన్నాడు అని తెలిసి అతనితో ప్రయాణం చేయకూడదు మరియు అతనిని బండి నడపనివ్వకూడదు’. అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెల్లడించింది. సో..ద్విచక్ర వాహనమైనా..ఫోర్ వీలర్ అయినా..డ్రైవర్ మద్యం తాగి ఉంటే..అతనితో పాటు..ప్రయాణిస్తూ..తనిఖీల్లో దొరికితే..మాత్రం బుక్ అయినట్లే.