Toddy Corona : తాటి క‌ల్లు తాగితే కరోనా రాదా? తాటి కల్లులో కోవిడ్ వైరస్ కారకాలను చంపే ఆయుర్వేద గుణం ఉందా?

Toddy Corona : తాటి క‌ల్లు తాగితే కరోనా రాదా? తాటి కల్లులో కోవిడ్ వైరస్ కారకాలను చంపే ఆయుర్వేద గుణం ఉందా?

Toddy Corona

Is Toddy Medicine For Corona : కరోనాకు మందే లేదని ప్రభుత్వాలు, డాక్టర్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా నెత్తీనోరు బాదుకుంటున్నా… కొంతమంది తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. కరోనాకు విరుగుడు కనిపెట్టాం అంటూ అశాస్త్రీయ పద్దతులను అవలంభిస్తున్నారు కొందరు వ్యాపారులు. అంతేకాదు ప్రచారాలు కూడా చేస్తున్నారు. దాన్ని నమ్మి అమాయకులు అడ్డంగా మోసపోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మద్యం సేవిస్తే కరోనా రాదని గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో ప్రచారం బాగా జరుగుతోంది. తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారం కొన్ని ఊళ్లల్లో జోరుగా నడుస్తోంది. దీన్ని కొందరు ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాటి కల్లును కరోనా మందుగా భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కల్లుకి డిమాండ్ పెరిగింది.

కరోనాకు మందు లేదు. కరోనా చికిత్సకు వాడే కొన్ని ఔషధాలు కూడా కోవిడ్ తీవ్రతను తగ్గించేవి మాత్రమే. అంతే కానీ కరోనాకు మెడిసిన్ లేదు అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. అయినప్పటికి కనుకల గ్రామస్తులు మాత్రం కరోనాకు మందు దొరికిందని సంబరపడుతున్నారు. తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారాన్ని గట్టిగా నమ్ముతున్నారు. తాటి కల్లు తాగేందుకు క్యూ కట్టారు. అంతేకాదు అలవాటు లేని వారు సైతం తాటి కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాటి కల్లులో వైరస్ కారకాలను చంపే ఆయుర్వేద గుణం ఉందని, అందుకే తాటి కల్లు తాగిన వారికి కరోనా రావటం లేదని స్థానికులు చెబుతున్నారు.

ఈ నమ్మకంతో కనుకుల గ్రామంలో తాటికల్లుకి గిరాకీ బాగా పెరిగింది. గీత కార్మికులకు ఫోన్ చేసి మరీ కల్లుని బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకోకుంటే కల్లు దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. నిజంగా తాటి కల్లు కరోనాకు మందైతే.. సైంటిస్టులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఈ గ్రామస్తులకే తెలియాలి.

వాస్తవానికి తాటి కల్లు ఆరోగ్యానికి మంచిదే అంటారు. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని చెబుతారు. తాటికల్లుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయని, జంక్ ఫుడ్స్‌ తిని ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుందని అంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతారు. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు కూడా చెప్పారు. అయితే, ఈ తాటి కల్లు.. కరోనాకు కూడా మందులా పని చేస్తుందని, తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదంటున్నారు డాక్టర్లు.