ఆ డివిజన్‌లో ‘సున్నా’ ఓట్లు.. సింగిల్ డిజిట్‌ ఏంటన్నా?!

  • Published By: sreehari ,Published On : December 6, 2020 / 12:10 PM IST
ఆ డివిజన్‌లో ‘సున్నా’ ఓట్లు.. సింగిల్ డిజిట్‌ ఏంటన్నా?!

Jangammet Division Candidates: గ్రేటర్ ఎన్నికల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎంత మెజార్టీ వచ్చింది? ఎంతమంది గెలిచారు? ఎంతమంది ఓడారు.. ఇలా లెక్కలేసుకోవడం కామన్.. కానీ, కొంతమంది అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదంట.. పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చి ఉంటాయి.. కానీ, స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరికి అసలు ఓట్లే పడలేదంట.. జంగంమెట్ డివిజన్‌లో అయితే.. ఖాతానే తెరవలేదంట.. ఒక అభ్యర్థికి ఒక్క ఓటూ కూడా పడలేదంట.. అంటే.. సున్నా.. తన ఓటు కూడా తాను వేసుకోలేదంట.. కనీసం పది ఓట్లు కూడా దక్కని అభ్యర్థులెందరో ఉన్నారంట.



గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ వంటి పెద్ద పార్టీలు పోటాపోటీగా బరిలో నిలిచాయి. గట్టిపోటీనిచ్చాయి. కానీ, చిన్నపార్టీలు, కొంతమంది అభ్యర్థులకు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. బల్దియా ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 0,1,2,3,4,5,6 ఇవి అంకెలు కాదండోయ్.. గ్రేటర్ ఫలితాల్లో కొంతమంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లుంట.. ఇలా సింగిల్ డిజిట్ ఓట్లే వచ్చాయంట.



ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 1122 మంది పోటీ చేశారు. వీరిలో 70 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. జంగంమెట్ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది పోటీ చేశారు. పెద్ద బ్యాలెట్ అవసరం పడింది. ఇందులో 13 మంది స్వతంత్రులే ఉన్నారు. ఆరుగురు పది లోపే ఓట్లు సాధించారు. రజనీకాంత్ అనే అభ్యర్థికి ఒక్క ఓటూ కూడా పోలవ్వలేదు. మరో అభ్యర్థి వెంకటేశ్ కు మూడే ఓట్లే వచ్చాయి.



ఇక మైలార్ దేవ్ పల్లి నుంచి బీఎంపీ తరపున పోటీ చేసిన గిరిబాబు యాదవ్ కు ఒక్క ఓటే వచ్చింది. తన ఓటు మాత్రమే తనకు పడిందన్నమాట.. మెహిదీపట్నం బీఎంపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ కు 8 ఓట్లు వచ్చాయి. మన్సూరాబాద్ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి, సరూర్ నగర్ లో పోటీ చేసిన దీపిక యాదవ్ కు రెండు ఓట్లు వచ్చాయి. హెచ్ బీకాలనీలో పృథ్వికుమార్ కు 4 ఓట్లు రాగా, సరూర్ నగర్ స్వతంత్ర అభ్యర్థి సాయికి 6 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కుర్మగూడ స్వతంత్ర అభ్యర్థికి 3 ఓట్లు, పురానాపూల్ లో టీజేఎస్ పీ అభ్యర్థికి ఆరు ఓట్లు దక్కాయి. బంజారాహిల్స్ లో మరో ఐదుగురు అభ్యర్థులకు కూడా సింగిల్ డిజిట్ ఓట్లే దక్కాయి. కేపీహెచ్ బీలో 11 మంది పోటీచేయగా.. వారిలో ముగ్గురికి ఐదుకు మించి ఓట్లు రాలేదంట..