ఇక పరీక్షలు, ప్రాక్టికల్స్ అన్నీ దగ్గర కాలేజీల్లోనే!

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 07:49 AM IST
ఇక పరీక్షలు, ప్రాక్టికల్స్ అన్నీ దగ్గర కాలేజీల్లోనే!

Exams, Practicals to Near Colleges : ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను దగ్గర కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ ఇదే ప్రయత్నాల్లో ఉంది. కరోనా కారణంగా కాలేజీలు ప్రారంభం కాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు నగర ప్రాంతాల్లో 90శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు శాతం నమోదైంది.



ఆన్‌లైన్‌ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా క్లాసులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది.

సెమిస్టర్‌ పరీ‌క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. జేఎన్‌టీయూ పరిధిలోని 180కిపైగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్‌లో 50వేల మంది విద్యార్థులు ఉన్నారు.



ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్‌లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ప్రథమ సెమిస్టర్‌ విద్యార్థులు మినహా మిగతా 5 సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే తమ కాలేజీలకు దూరంగా ఉంటున్నారు.
https://10tv.in/be-careful-with-online-cheatings-and-online-shopping-frauds/
కరోనా కారణంగా తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉండాల్సి వస్తోంది. అక్కడే ఉండి ఆన్‌లైన్‌ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్‌ పూర్తి కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మాత్రం సగమే పూర్తి అయిందని అంటున్నారు.



ఆన్‌లైన్‌లో అదనపు క్లాసులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. విద్యార్థులందరూ తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్‌ చేయడం వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.



దీనికి అవసరమైన షెడ్యూల్‌ను రెడీ చేస్తోంది. షెడ్యూలు జారీ కాగానే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా తమ దగ్గరి కాలేజీల్లోనే సెమిస్టర్‌ పరీక్షలు రాయడంతో పాటు ప్రాక్టికల్స్‌ కూడా చేసుకునే వెసులుబాటు కలుగనుంది.