Ration Cards, Pensions : త్వరలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు

త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.

Ration Cards, Pensions : త్వరలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు

Jobs, Ration Cards, Pensions Ktr

Jobs, Ration Cards, Pensions : త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులకు 2,016రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, దీంతో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని అన్నారు. సోమవారం(ఏప్రిల్ 12,2021) మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ వచ్చాక అభివృద్ధి చెందింది:
సమైక్య పాలనలో తెలంగాణ వివక్షకు గురైందన్న కేటీఆర్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందిందని అన్నారు. విద్యార్థుల ఉన్న‌త విద్య కోసం ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌లు కూడా అందిస్తున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించామని, ప్రస్తుతం తెలంగాణలో మిగులు విద్యుత్ ఉందని తెలిపారు. వ‌రంగ‌ల్ ను అద్భుత‌మైన న‌గ‌రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలు ఆపలేదని మంత్రి అన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా అమలు చేయడంతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.

బీజేపీకి ఇదే ఆఖరి వార్నింగ్:
సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇదే చివరి హెచ్చరికని తేల్చి చెప్పారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్ని కోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని బీజేపీని ప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని.. వరంగల్‌కు మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని కేటీఆర్‌ అన్నారు.

‘‘మోదీ ఇచ్చిన కొలువులెన్ని? అమ్మిన సంస్థలెన్ని? అని కేటీఆర్ అడిగారు. నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారని విపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. దయచేసి యువతను గందరగోళానికి గురిచేయొద్దన్నారు. తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురికావొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 50వేల ఉద్యోగాలకు ప్రకటన ఉంటుందని మరోసారి చెప్పారు.

”ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయొద్దు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కేయూ స్టూడెంట్ సునీల్‌ను రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడు. సునీల్‌కు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే కేసీఆర్‌పై మాట్లాడారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడు. ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకుంటున్నారు… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారు?” అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.