జీహెచ్ఎంసీ ఎన్నికలు : శాంతిభద్రతలపై కేసీఆర్ సమీక్ష, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 06:56 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : శాంతిభద్రతలపై కేసీఆర్ సమీక్ష, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

KCR directs police : సీఎం కేసీఆర్‌ శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమయంలో కొన్ని అరాచకశక్తులు రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర చేస్తున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. అలాంటి వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమన్నారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు.



జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారని…. మొదట సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. మార్ఫింగ్‌ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారని.. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారని చెప్పారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదని తెలిపారు. అందుకే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్ లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారని తెలిపారు.



హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. పెద్ద ఎత్తున గొడవలు చేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారన్నారు సీఎం కేసీఆర్‌. దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని స్పష్టం చేశారు.



https://10tv.in/minister-ktr-fires-on-bjp-leaders/
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరు వచ్చిందని.. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ప్రశాంత హైదరాబాద్ లో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ కోరారు.



అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. పలుచోట్ల ప్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.