గ్రేటర్ ఎలక్షన్స్‌పై కేసీఆర్ ఫోకస్… నేడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

  • Published By: bheemraj ,Published On : November 18, 2020 / 07:08 AM IST
గ్రేటర్ ఎలక్షన్స్‌పై కేసీఆర్ ఫోకస్… నేడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

kcr focus ghmc elections : ఎన్నికల నగారా మోగడమే ఆలస్యం… గ్రేటర్ ఎలక్షన్స్‌పై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి స్కెచ్చులేసిన అధినేత.. వాటిని ఎలా అమలు చేయాలనే విషయంపై ఇవాళ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా.. పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండాను ఎగురవేయడంపై చర్చించనున్నారు.



టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఇవాళ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన భేటీకానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ.. పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు వెళ్లాయి. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సమయంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు.



దుబ్బాక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికలకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ను బీజేపీ బాగా ఉపయోగించుకుంది. కానీ… ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని భావించిన కేసీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు వేగంగా రెడీ కావాలని యోచిస్తున్నారు. ఇవాళ జరగబోయే టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండా కానున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.



ఆయా డివిజన్లలో టీఆర్ఎస్‌ను గెలిపు బాధ్యతను వారి భుజాలపై పెట్టే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు పక్కా అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్. గతంలో అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సర్వేలు చేయించామని.. వందకు మించి స్థానాలు వస్తాయని ముందే చెప్పేసారు. టార్గెట్ హండ్రెస్ ప్లస్ కాబట్టి.. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే విషయంపై ఈ మీటింగ్‌లో కేసీఆర్ మార్గదర్శనం చేస్తారు.



సిట్టింగ్ సీటు కావడం… సానుభూతి కలిసొస్తుందనే ఉద్దేశంతో… దుబ్బాకలో ఏమ‌ర‌పాటుగా ఉండటం వల్లే పార్టీ అభ్యర్థి ఓడిపోయింద‌ని టీఆర్ఎస్ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఆ తప్పు రిపీట్ కాకుండా ముందే అలర్ట్ అయింది. నేటి సమావేశం తర్వాత.. నేత‌లంద‌రికి త‌మను ఎక్కడ ఇంచార్జ్‌గా వేశారు.. అక్కడ రాజ‌కీయ ప‌రిస్థితులు, ఓట‌ర్లకు సంబంధించిన అంశాల‌తో కూడిన స‌మ‌గ్ర నివేదిక‌ను అందించ‌ే అవకాశం ఉంది.



https://10tv.in/telangana-to-be-conducted-lakhs-of-covid-tests-in-state-wise-after-central-orders/
టీఆర్‌ఎస్‌ అధిష్టానం అభ్యర్థులు ఎవరన్న దానిపైనా కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో 100మందికిపైగా అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించే అవకాశముంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే అధిష్టానం పలుమార్లు సర్వేలు కూడా చేయించింది. వాటి ఆధారంగానే గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వనున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మొహమాటానికి పోయి గెలిచే అవకాశం లేనివారికి టికెట్లు ఇవ్వకూడాదని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్ల పనితీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే.. వేటు తప్పదనే విధంగానే హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో.. సిట్టింగుల్లో ఎంతమందికి మళ్లీ టికెట్ ఇవ్వాలి. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే విషయాలపై ఫోకస్ పెట్టనున్నారు.



ఎన్నికల ప్రచారం సహా ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ తరపున గ్రేటర్‌లో అన్ని అంశాలను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లోని అనేక డివిజన్లకు సంబంధించిన బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు అప్పగించాలని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఎప్పటికప్పుడు ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంతో పాటు ఇతర విషయాలపై నేతలతో సమన్వయం చేసేందుకే ఈ కమిటీ ఉపయోగపడుతుందని భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికలను ప్రత్యర్థి పార్టీలు, మరీ ముఖ్యంగా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం… దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి ఎదురుకావడం వంటి అంశాలు.. ఈసారి టీఆర్ఎస్ మరింత ఎక్కువగా ఎన్నికలపై దృష్టి పెట్టేలా చేశాయి.



అభ్యర్థుల ఎంపిక అనంతరం… గ్రేటర్‌లో నేతల ప్రచారం, అభ్యర్థుల ప్రచారం సహా అన్ని అంశాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. పది మందితో ఏర్పాటు కాబోయే కమిటీ.. ఎప్పటికప్పుడు పరిస్థితులపై కేటీఆర్‌కు సూచనలు చేయడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్‌కు పరిస్థితిని వివరించనున్నట్టు తెలుస్తోంది.