నల్గొండ ఉప ఎన్నిక : నోముల కుటుంబానికి లేదా రెడ్డి వర్గానికి టికెట్‌ దక్కే అవకాశం!

నల్గొండ ఉప ఎన్నిక : నోముల కుటుంబానికి లేదా రెడ్డి వర్గానికి టికెట్‌ దక్కే అవకాశం!

kcr nalgonda tour : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్టులన్నీంటికి ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్‌. తొమ్మది ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారాయన. మరోవైపు.. ఆ పథకాలకు పదో తేదీన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు‌. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు తెలిపారాయన.

3 వేల కోట్ల రూపాయలతో నెల్లికల్లు లిఫ్టుతోపాటు మరో 9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు నేతలకు సూచించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఒకేచోట శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంట 30 నిమిషాలకు నెల్లికల్లులో సీఎం కేసీఆర్‌ నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో టీఆర్ఎస్ బహిరంగసభలో ప్రసంగిస్తారు సీఎం కేసీఆర్. మరోవైపు.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక మార్చి నెలలో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, సాగర్‌ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్‌లోనే ఉండాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ జిల్లా నాయకులకు సూచించారు. సాగర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతల వరుస పర్యటనలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కనీసం 100 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి నోముల కుటుంబానికి, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్‌ దక్కే అవకాశం ఉందంటున్నారు గులాబీ నేతలు.