పీఆర్సీ ఫిట్‌మెంట్‌ పెంచితే ఎంత భారం పడుతుంది?

పీఆర్సీ ఫిట్‌మెంట్‌ పెంచితే ఎంత భారం పడుతుంది?

kcr-will-make-a-statement-on-the-prc-fitment-after-the-report-of-the-committee1

prc fitment after the report of the committee : పీఆర్సీపై తెలంగాణ సర్కార్‌ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సగటును ఒకశాతం ఫిట్‌మెంట్‌ పెంచితే ఎంత భారం పడుతుంది, ఎంత పర్సంటేజ్ ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశంపై నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్‌ సీఎంకు చేరాక సానుకూల నిర్ణయం వెలువడనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. మూడు రోజుల పాటు బీఆర్‌కే భవన్‌లో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సేకరించిన త్రిసభ్య కమిటీ… ఒక నివేదికను తయారు చేసింది. బిశ్వాల్‌ కమిటీ సూచించిన 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను అన్ని ఉద్యోగసంఘాలు వ్యతిరేకించడంతో.. సగటున ఒక శాతం ఫిట్‌మెంట్‌ పెంచితే ఎంత భారం పడుతుందనేదానిపై లెక్కలేసింది. ఫిట్‌మెంట్‌ పర్సంటేజ్ ఎంత ఉంటే ఎంతగా భారం పెరుగుతుందో ఒక నివేదిక తయారుచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ రిపోర్ట్‌ను సీఎం కేసీఆర్‌కు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమర్పించనుంది.

పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 2018 మే 18న బిశ్వాల్‌ కమిటీని ఏర్పాటు చేసింది టీఆర్‌ఎస్ సర్కార్‌. మూడు నెలల్లోనే రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉన్నా.. 31 నెలల పాటు కాలయాపన చేసింది. గతేడాది డిసెంబర్‌ 31న కమిటీ రిపోర్ట్‌ ప్రభుత్వానికి అందింది. ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చని ఆ నివేదికలో సిఫారసు చేసింది. దీంతో ఉద్యోగసంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తీవ్ర వ్యతిరేకత రావడంతో..బిశ్వాల్‌ కమిటీ రిపోర్ట్‌ను అధ్యయనం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు , సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్‌తో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ మొత్తం 13 సంఘాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించింది. అయితే 45 శాతం కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనని మెజార్టీ ఉద్యోగసంఘాలు పట్టుబట్టాయి.

హైదరాబాద్‌ రేంజ్‌లో 30 నుంచి 24 శాతానికి తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబును పెంచాలని డిమాండ్‌ చేశాయి. ప్రమోషన్‌లు ఇవ్వాలని, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశాయి. దీంతో సవరణల దిశగా ఆలోచన చేసింది త్రిసభ్య కమిటీ. ఫిట్‌మెంట్‌ ఒక్కశాతం పెంచితే ఏకంగా 250 కోట్ల నుంచి 300 కోట్లు వరకు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసింది త్రిసభ్య కమిటీ. ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నట్లు 45 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏకంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని లెక్కలేసింది. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అందుకే.. బిశ్వాల్‌ కమిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్‌ సూచించిందని అభిప్రాయపడింది.

ఏదేమైనా ఉద్యోగసంఘాల అన్ని డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న త్రిసభ్య కమిటీ.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చింది. తామిచ్చే నివేదికను సీఎం కేసీఆర్‌ పరిశీలించాక.. ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేస్తారని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. ఓవరాల్‌గా 25 శాతం నుంచి 30 శాతం లోపు ఫిట్‌మెంట్‌ ప్రకటన రావొచ్చని ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభివృద్ధి,సంక్షేమం కొనసాగిస్తూనే.. భారీగా ఫిట్‌మెంట్‌ ఇస్తే మోయలేనంత ఆర్థికభారం పడుతుందని, జీతాలు చెల్లింపులకు కూడా ఇక్కట్లు పడాల్సి వస్తుందని సర్కార్‌ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ తీసుకోనున్న నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉద్యోగస్తులు టెన్షన్‌ పడుతున్నారు.