కీసర ACB ట్రాప్ కేసు : వారిద్దరిదీ ఆత్మహత్యలు కాదు..హత్యలే – KLR

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 05:58 PM IST
కీసర ACB ట్రాప్ కేసు : వారిద్దరిదీ ఆత్మహత్యలు కాదు..హత్యలే – KLR

Keesara ACB Trap Case : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో వర్షన్‌ బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మార్వో నాగరాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలు మరింత పెంచేలా వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌. నాగరాజు, ధర్మారెడ్డి ఇద్దరివీ ఆత్మహత్యలు కాదు హత్యలే అంటున్నారు ఆయన.



ఎమ్మార్వో చనిపోతే ఎవరికి లాభమో, బతికుంటే ఎవరికి నష్టమో గుర్తించాలన్నారు KLR. ఈ భూముల్లో తెలంగాణ అధికార ఎమ్మెల్యేతో పాటు ఓ ఏపీ మంత్రి మరికొందరు ప్రముఖులకు భూములున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి వివాదాస్పద భూమి 23 ఎకరాలు కాదని 93 ఎకరాలని ఆయన అంటున్నారు. ఈ భూ వివాద పరిష్కారానికి అప్పటి రెవెన్యూ మంత్రి ఓఎస్డీ కీలకంగా వ్యవహరించారన్నారు KLR.



ప్రభుత్వంలో ఎవరో ఒకరు సహకరించకపోతే ఈ వ్యవహారం సాధ్యం కాదంటున్నారు కేఎల్‌ఆర్. ఆర్డీఓ ఎకరానికి 3లక్షల చొప్పున ఢీల్ కుదుర్చుకున్నారని… ఇందులో కలెక్టర్‌ నుంచి కిందిస్థాయి అధికారి వరకూ అందరి పాత్ర ఉందనేది కేఎల్‌ఆర్‌ ఆరోపణ. కీసర ఎమ్మార్వో నాగరాజుది ముమ్మాటికీ హత్యే అంటున్నారు KLR. దీని వెనక అధికార, ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులున్నారన్నారు. వారిద్దరూ బతికుంటే ఎవరిపేరో బయటకు వచ్చే అవకాశం ఉందని అందుకే హత్య చేశారని ఆరోపించారు KLR.



కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు మలుపులు తిరుగుతోంది. జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం, బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ కేసులో పెద్దపెద్ద నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. బతికి ఉంటే ఎవరు పేర్లు బయటకు వచ్చేవి, వీరు ఆత్మహత్య చేసుకునేలా ఎవరు ఒత్తిడి చేశారనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.



ధర్మారెడ్డి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అసలు ధర్మారెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని, అతని కుటుంబ సభ్యులు ఎందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారో తెలియదన్నారు. జైలులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు, బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి ఆత్మహత్యలు చేసుకోవడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. అవి ఆత్మహత్యలు కావు హత్యలని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలిపారు. మరి వాస్తవం ఏంటో దర్యాప్తులో వెల్లడి కానుంది.