ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కీలక విషయాలు వెలుగులోకి

ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కీలక విషయాలు వెలుగులోకి

Attempted rape case of a pharmacy student : హైదరాబాద్‌ శివార్లలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్మసీ విద్యార్థినిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలను 10టీవీ సంపాదించింది. నాగారంలోని రాంపల్లి చౌరస్తాలో సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. షేర్ ఆటోలో ఫార్మసీ విద్యార్థినితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ప్రయాణించారు. అయితే మిగిలిన ప్రయాణికులను దించేసిన ఆటో డ్రైవర్.. ఫార్మసీ విద్యార్థిని మాత్రం దింపకుండా తీసుకెళ్లాడు.

తన స్నేహితులతో కలిసి యువతిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. ఈ క్రమంలో యువతిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకొని యువతిని వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆడవాళ్లపై అకృత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్‌ నగర శివార్లలో ఫార్మసీ యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసులో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. యువతిని తీసుకెళ్లిన ఆటో, ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. ఘట్ కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయల్దేరింది. ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిచించి.. బలవంతంగా పొదల్లోకి లాక్కెల్లాడు. ఆ ముగ్గురు యువతి బట్టలు చించేసి అత్యాచారయత్నం చేశారు. ఆతర్వాత రోడ్డుపై వదిలి పరారయ్యారు.

ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 6గంటల 30నిమిషాల టైమ్‌లో నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, మరో ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన విద్యార్ధిని తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే నిందితుడు మరికొందరి సాయంతో ఆమెను ఆటోలో నుంచి మారుతీ వ్యాన్‌లోని ఎక్కించాడు. వారంతా యానాంపేట సమీపంలోని పొదల్లోకి యువతిని తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు.

కుమార్తె ఫోన్‌తో అప్రమత్తమైన తల్లి.. బంధువుల సాయంతో డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేశారు.. అది నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు.

ఎట్టకేలకు రాత్రి 7గంటల 50నిమిషాల సమయంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే.. ఆమెను మేడిపల్లిలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని తెలిపారు పోలీసులు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న దానిపై కాసేపట్లో వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు.

మరోవైపు.. దారుణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడిన ఆమె.. అమ్మాయికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సత్యవతి రాథోడ్. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని క్యూర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.

అసలేం జరిగింది?

సాయంత్రం 6 గంటలకు నాగారం చేరుకున్న విద్యార్థిని

6.05కి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతి

6.06కి ఆటో ఎక్కిన మరో ఇద్దరు ప్రయాణికులు

6.08కి కొద్ది దూరంలో ఇద్దరు ప్రయాణికులను దించేసిన ఆటో డ్రైవర్

6.10కి యువతి దిగాల్సిన స్టాప్ వద్ద వేగంగా వెళ్లిన ఆటో డ్రైవర్

6.12కి ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేశాడని తల్లికి ఫోన్లో చెప్పిన యువతి

6.14కి కూతురి కిడ్నాప్ విషయాన్ని బంధువుకు తెలిపిన యువతి తల్లి

6.29కి అమ్మాయి కిడ్నాప్ అయిందని 100కి ఫోన్

6.40కి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిన కీసర, ఘట్‌కేసర్ పోలీసులు

6.42కి యానంపేట వద్ద యువతిని మరో వ్యాన్‌లోకి ఎక్కించిన ఆటోడ్రైవర్, అతని ఫ్రెండ్స్

6.50కి ఘట్‌కేసర్‌లోని రైల్వే ట్రాక్‌ వద్దకు అమ్మాయిని తీసుకెళ్లిన వ్యక్తులు

6.55కి యువతి ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు

7.05కి పోలీసుల సైరన్‌ విని మరో చోటుకు అమ్మాయిని తీసుకెళ్లిన యువకులు

7.15కి లొకేషన్ ఆధారంగా అన్నోజిగూడ సమీపంలో యువతి ఉన్నట్లు గుర్తింపు

7.25కి అన్నోజిగూడ చేరుకున్న మూడు పెట్రోలింగ్ వాహనాలు

7.45కి పోలీసులను చూసి అమ్మాయిని వదిలిపెట్టిన పరారైన యువకులు

7.50కి అమ్మాయిని ట్రేస్ చేసి గుర్తించిన పోలీసులు