ఆటో డ్రైవర్ దురాశ : డబ్బు కోసం వలస కూలీలను చంపేశారు

ఆటో డ్రైవర్ దురాశ : డబ్బు కోసం వలస కూలీలను చంపేశారు

nalgonda district : మనుషుల్లో దురాశ పెరిగిపోతుంది. పరువు కోసం హత్యలు చేసే వారు కొందరు, ఆస్తుల కోసం హత్యలు చేసే వారు ఇంకొందరు. వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలు మరికొన్ని. కానీ నల్గొండలో చిల్లర డబ్బుల కోసం దారుణానికి తెగించారు దుండగులు. జనవరి 25 ఉదయం వేళ నల్గొండ టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫోన్‌ కంటిన్యూస్‌గా రింగవుతోంది. మిర్యాలగూడ రోడ్డులో ఇద్దరు హత్యకు గురయ్యారంటూ చెప్పాడు అవతలి వ్యక్తి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు చనిపోయిందెవరో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు.

మృతదేహాల ఫోటోల ద్వారా చనిపోయింది ఎవరో కనుక్కున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పోతులూరుకి చెందిన బొండి నాగేశ్వర్ రావు, బొండి రాంజీలుగా గుర్తించారు. వీరు నల్లగొండలో కూలీ పని చేసుకొని జీవనం సాగించేవారని తేలింది. చనిపోయిన వ్యక్తుల వివరాలు తెలిసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హతులిద్దరు వలస కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో నల్గొండ నుంచి సొంతూరికి వెళ్లారు. తిరిగి పని కోసం వచ్చారు. అయితే ఇక్కడ పని లేకపోవడంతో తిరిగి సొంతూరుకు బయల్దేరినట్టు పోలీసులు కనుకున్నారు.

హత్యకు గల కారణం పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆస్తులు, వివాహేతర సంబంధాలు ఈ హత్యకు కారణం కాదని తెలిసింది. మరి చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది అనేది చిక్కుముడిగా ఉంది. అయితే వలస కూలీలు తిరుగు ప్రయాణం అయ్యారనే క్లూ ద్వారా రైల్వే స్టేషన్‌ దారిలో ఉన్న సీసీ కెమెరా రికార్డులు పరిశీలించారు. అందులో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆటో ఎక్కినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్‌ వెళ్లేందుకు నాగేశ్వర్, రాంజీలు ఆటో ఎక్కారు. పని కోసం వచ్చిన వారు ఇక్కడ ఉండేందుకు వీలుగా బ్యాగులో లగేజీ తెచ్చుకున్నారు. ఆ బ్యాగులో డబ్బులు ఉన్నాయని భావించాడు ఆటోడ్రైవర్‌. అంతే దాన్ని కాజేయాలని చూశాడు. సాయం రావాలంటూ స్నేహితుడు అమీర్‌ని కోరాడు. ఇద్దరు కలిసి ఆటోలో వారిని ఊరి బయటకు తీసుకెళ్లి బ్యాగు దొంగలించారు. ఎక్కడ తమను గుర్తు పడతారో అని బండరాయితో తలపై కొట్టి చంపేశారు. ఇంతకీ ఆ బ్యాగులో బట్టలు కాకుండా ఉన్న నగదు కేవలం 500 రూపాయలు మాత్రమే. కానీ పోయినవి రెండు నిండు ప్రాణాలు.