20ఏళ్లు నెత్తిన పెట్టుకుని గెలిపించుకుని అసెంబ్లీకి పంపితే గాలికి వదిలేశారు, కాంగ్రెస్ సీనియర్ నేత తీరుపై కార్యకర్తల ఆగ్రహం

  • Published By: naveen ,Published On : October 13, 2020 / 12:04 PM IST
20ఏళ్లు నెత్తిన పెట్టుకుని గెలిపించుకుని అసెంబ్లీకి పంపితే గాలికి వదిలేశారు, కాంగ్రెస్ సీనియర్ నేత తీరుపై కార్యకర్తల ఆగ్రహం

komati reddy venkat reddy: కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలో కేడర్‌ ఆగ్రహంగా ఉందనే టాక్‌ నడుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరసగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన వెంకట్ రెడ్డి ఘనవిజయం సాధించి ఎంపీ అయ్యారు.

గాంధీభవన్ గడప తొక్కకుండానే తమ మార్కు రాజకీయం:
2018 ఎన్నికల సమయంలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ వేడి పుట్టించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని డిమాండ్ చేశారు. తాజాగా తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నా అంటూ ముందుకొచ్చారు. ఇక జాతీయ, రాష్ట్ర స్థాయి సీనియర్ నేతలపై విమర్శలకు సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెనకాడరు. జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల గడప,. రాష్ట్రంలో గాంధీభవన్ గడప తొక్కకుండానే తన స్టైల్లో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందంటున్నారు.

తమను గాలికి వదిలి వెళ్లిపోయారని ఆగ్రహం:
తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఖరిపై నల్లగొండ నియోజకవర్గ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. 20 సంవత్సరాలు నెత్తిన పెట్టుకుని గెలిపించుకుని శాసనసభకు పంపితే, 2018లో ఓటమి తర్వాత తమను గాలికి వదిలి వెళ్లిపోయారని కస్సుబుస్సులాడుతున్నారు. తమను అసలు పట్టించుకోవడమే మానేశారని వాపోతున్నారు. సుదీర్ఘకాలం వెన్నంటి ఉన్న కార్యకర్తలకు అండగా ఉండాల్సిన వెంకట్‌రెడ్డి.. ఓటమి తర్వాత నియోజకవర్గానికి రాకపోవడం ఆ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమని అంటున్నారు.

అండ లేక, పార్టీలో ఆదరణ లేక కార్యకర్తల ఇబ్బందులు:
పార్టీ కంటే వ్యక్తి కోసం ఎక్కువగా పని చేసిన తమకు ఇప్పడు అండ లేక, పార్టీలో ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నామని, నమ్ముకున్న తమను నట్టేట ముంచారంటూ వెంకట్‌రెడ్డి తీరును దుయ్యబడుతున్నారు. ఓ వైపు అందివచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆపరేషన్ ఆకర్ష్‌తో అధికార పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు 20 ఏళ్లు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కీలక నేతగా ఎదిగిన నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమను పట్టించుకోకపోవడాన్ని కార్యక్తలు జీర్ణించుకొలేకపోతున్నారు. దసరా తర్వాత నల్లగొండకు మకాం మార్చేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అనుచరులు చెబుతున్నారు.

ఇది మరో ఎత్తుగడా?
వచ్చే ఉగాది నాటికి కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని నల్లగొండలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వెంకట్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మరి ఇది కార్యకర్తలను సంతృప్తి చేసేందుకు వేసిన ఎత్తుగడా? భువనగిరి ఎంపీగా నల్లగొండలో మకాం పెట్టడం సాధ్యమేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆయన నల్లగొండకు మకాం మారిస్తే నియోజకవర్గ రాజకీయాలు ఏకపక్షంగా కాకుండా రంజుగా సాగే అవకాశం ఉందంటున్నారు.