Telangana Congress : కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి : గాంధీభవన్ వేదికగా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో కొండాసురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Congress : కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి : గాంధీభవన్ వేదికగా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha demands to suspend Komatireddy Venkatreddy from Congress

Telangana Congress : గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో కొండాసురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం కలిగే మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. కొండా సురేఖ మాటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకుని వ్యక్తిగత అంశాలు వద్దంటూ సముదాయించారు. ఏదైనా ఉంటే ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు చెప్పాలని సూచించారు. కాగా.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఈక్రమంలో అందరం కలిసి పని చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయిందని ఇప్పటికైనా అందరం కలిసి ఐకమత్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని… ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. సమావేశం అజెండాలో ఉన్న అంశాలపైనే మాట్లాడాలని… వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. గాంధీభవన్ లో ఈరోజు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. రేవంత్ నేతృత్వంలో పనిచేయటానికి అసహనం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదు. గాంధీ భవన్ కు గత ఏడాది నుంచి రావటం మానేశారు వెంకట్ రెడ్డి. ఆఖరికి కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్వయంగా ఫోన్ చేసిన గాంధీ భవన్ కు రండి మాట్లాడుకుందాం అని పిలిచినా వెళ్లలేదు. పైగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు కూడా తమ్ముడిని వారించలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నికల వచ్చింది. ఈ ఎన్నికలో కూడా పార్టీ తరపున వెంకట్ రెడ్డి ప్రచారం చేయాలేదు సరికదా..తన తమ్ముడిని (బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి)ని గెలిపించాలని మునుగోడు కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చానే ఆరోపణలు వచ్చాయి.

పైగా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఎగేయటానికి ఏకంగా విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ నుంచి రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తూ ఓ సారి రాజీనామాచేస్తానని మరోసారి ఇక రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఇలా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఈక్రమంలో సడెన్ గా వెంకటరెడ్డి గాంధీభవన్ లో ప్రత్యక్షమయ్యారు అందరిని ఆశ్చర్యపరుస్తూ. పైగా రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇది మరీ ఆశ్చర్యం కలిగించింది. ఇకనుంచి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని కూడా తెలిపారు. ఇలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది.  గాంధీ భవన్ వేదికగా పీసీసీ చీఫ్ రేవంత్,ఎంపీ కోమటిరెడ్డి సమావేశం.. చేతులు కలపటంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఓ శుభపరిణామం అని వీరిద్దరి మధ్యా ఉన్న గ్యాప్ తగ్గిందని అనుకునే సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.