కొండపోచమ్మ సాగర్ కుడి కాల్వకు గండి.. తప్పిన ప్రమాదం

కొండపోచమ్మ సాగర్ కుడి కాల్వకు గండి.. తప్పిన ప్రమాదం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో జలాశయం నుంచి భారీగా బయటకు వచ్చిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మంగళవారం(జూన్ 30,2020) ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండి పడింది. పొలాలు, కూరగాయల తోటలు ముంపుకు గురయ్యాయి. గ్రామస్తులు అందించిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుండి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే.

రాత్రి వేళ జరిగి ఉంటే:
ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రి వేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వ లైనింగ్​ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా నీటి పంపింగ్​ కొనసాగించడమే గండికి కారణమని తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాల్వకు గండి పడటానికి పూర్తి కారణాలు తెలుసుకుని నివేదిక సమర్పించాలన్నారు. కొండపోచమ్మ సాగర్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. నెల రోజుల క్రితమే సీఎం కేసీఆర్ ఎంతో గ్రాండ్ గా దీన్ని ప్రారంభించారు.

కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం:
సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను నిర్మించారు. రైతన్న సాగునీటి కష్టాలు తీర్చేందుకు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు. రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 4,700 ఎకరాలను సేకరించగా ములుగు మండలంలోని మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.