Free Nutrition Covid Victims : ఒక్క ఫోన్‌కాల్‌తో కోవిడ్ బాధితులకు ఉచితంగా పౌష్టికాహారం..ఆకలి తీరుస్తున్న కూకట్‌పల్లి యోగా విజ్ఞానకేంద్రం

కరోనా బాధితుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా కూకట్‌పల్లిలోని యోగా విజ్ఞాన కేంద్రం మారింది. 26 ఏళ్ల క్రితం.. రిషి ప్రభాకర్ గురూజీ ఈ మాతా అన్నపూర్ణేశ్వరి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు.

Free Nutrition Covid Victims : ఒక్క ఫోన్‌కాల్‌తో కోవిడ్ బాధితులకు ఉచితంగా పౌష్టికాహారం..ఆకలి తీరుస్తున్న కూకట్‌పల్లి యోగా విజ్ఞానకేంద్రం

Free Nutrition Covid Victims

Kookatpalli Yoga vignana kendram : పక్కింట్లో కరోనా వచ్చిందని తెలిస్తే.. మనింటి తలుపులు, కిటికీలు మూసేసుకొని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక.. మనింట్లోనే.. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. భయంభయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంతవాళ్లే అయినా.. దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహసించం. వాళ్ల ఆకలి తీర్చేందుకు.. భోజనం ప్లేట్ వాళ్లకిచ్చేందుకు కూడా పది సార్లు ఆలోచిస్తాం. అలాంటిది.. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా.. సేవే పరమావధిగా.. కోవిడ్ పేషెంట్ల పాలిట అన్నపూర్ణగా మారింది కూకట్‌పల్లిలోని ఓ యోగా కేంద్రం. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న.. వేలాది మంది కోవిడ్ బాధితుల ఆకలి తీరుస్తూ.. అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్న యోగా సెంటర్‌పై.. 10టీవీ.. స్పెషల్ రిపోర్ట్…

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. పాజిటివ్ వచ్చిన వాళ్లలో చాలా మంది ఇళ్లకే పరిమితమై.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. 4 గోడల మధ్యే ఉంటూ.. వైరస్‌తో పోరాడుతున్న కరోనా బాధితుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా కూకట్‌పల్లిలోని యోగా విజ్ఞాన కేంద్రం మారింది. 26 ఏళ్ల క్రితం.. రిషి ప్రభాకర్ గురూజీ ఈ మాతా అన్నపూర్ణేశ్వరి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు దీనిని.. ఆయన శిష్యుడు జగన్ గురూజీ నడుపుతున్నారు. ఆయన నేతృత్వంలో.. రోజూ వందలాది మంది ఆకలి తీరుస్తోంది ఈ యోగా కేంద్రం.

దశాబ్దాలుగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న యోగా విజ్ఞాన కేంద్రం.. ప్రస్తుతం కరోనా బాధితుల పాలిట అన్నపూర్ణగా మారింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ.. వంట చేసుకునే పరిస్థితులు లేక, పౌష్టికాహారం తినలేక ఇబ్బందిపడుతున్న వాళ్లకు.. తానున్నానని భరోసా ఇస్తోంది ఈ యోగా కేంద్రం. కోవిడ్‌తో పోరాడుతున్న వాళ్లందరికీ.. ఉచితంగా అన్నదానం చేస్తోంది.

కోవిడ్ బాధితులకు అందిస్తున్న ఆహారం కూడా ఏదో మామూలుది కాదు. ఏడు రకాల రుచులతో.. మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ వంటల తయారీలోనూ పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తున్నామని చెబుతున్నారు జగన్ గురూజీ. జస్ట్ ఒక్క ఫోన్‌ చేస్తే చాలు.. వందలాది కోవిడ్ బాధితులకు ఉచితంగానే పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.

భోజనం కావాల్సిన కోవిడ్ బాధితులు యోగా కేంద్రానికి ఫోన్ చేసి.. తమ పేరు నమోదు చేసుకోవాలి. కుటుంబసభ్యులందరికీ పాజిటివ్ వచ్చినా సరే.. వాళ్లందరికీ ఫుడ్ అందిస్తారు. యోగా కేంద్రానికి సమీపంలో ఉన్నవారికి.. తమ వాలంటీర్లే ఫుడ్ డెలివరీ చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి.. కోవిడ్ బాధితుల సన్నిహితులు, బంధువులు వచ్చి తీసుకెళ్తున్నారు. కష్టకాలంలో.. పౌష్టికాహారాన్ని అందిస్తున్న యోగ కేంద్రానికి అంతా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

కోవిడ్ బాధితులకే కాదు.. ప్రతి రోజూ యోగా కేంద్రం దగ్గరికి వచ్చే వందలాంది మంది ఆకలి తీరుస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 అయ్యిందంటే చాలు.. వందలాది మంది ఇక్కడ భోజనం చేసేందుకు బారులు తీరతారు. 26 ఏళ్లుగా.. ఈ అన్నదాన కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది. ఇక్కడ మాత్రమే కాదు.. యోగా కేంద్రానికి చెందిన సంచార అన్నదాన ప్రసాద రథం.. నగరంలోని రైతుబజార్లు, ఆసుపత్రుల దగ్గరకి వెళ్లి.. వారి ఆకలిని తీరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తులు సంభవించినా.. అక్కడికి తమ మొబైల్ అన్నప్రసాద రథం వెళ్లి.. ఉచితంగా అన్నదానం చేస్తోంది. కోవిడ్ బాధితులు, అన్నార్థుల కోసం యోగా కేంద్రం చేస్తున్న ఈ మంచిపనిని.. నగర ప్రజలు అభినందిస్తున్నారు.