కేటీఆర్ పర్యటన తర్వాత, వరంగల్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 09:52 AM IST
కేటీఆర్ పర్యటన తర్వాత, వరంగల్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

మంత్రి కేటీఆర్ వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లిన తర్వాత.. అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. వరంగల్ నగరానికి వరద ఎందుకు పోటెత్తింది ? దీనికి గల కారణాలపై క్షుణ్ణంగా మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

వరదనీరు సాఫీగా వెళ్లేలేని పరిస్థితి ఉందని, ఇందుకు నాలాలను కబ్జా చేయడమే కారణమని గుర్తించారు. తొలుత ఏరియల్ సర్వే చేసిన తర్వాత..నడుస్తూ..పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఓ ప్రాంతంలో వరద నీరు పోకుండా నాలాపై ఉన్న బిల్డింగ్ ను పరిశీలించారు. అక్కడ ఎలా నిర్మాణం ఎలా చేశారు ? దీనికి గల కారాణాలు ఏంటీ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏమీ సమాధానం చెప్పలేకపోయారు అధికారులు. వెంటనే అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు వెళ్లిన కొద్దిసేపటికే…అధికారులు చర్యలు తీసుకొనేందుకు రెడీ అయిపోయారు. కాజిపేట, హన్మకొండ, వరంగల్ లో 435 అక్రమ నిర్మాణాలను గుర్తించారు.

యుద్ధ ప్రాతిపదికన 137 మందికి నోటీసులకు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ చూపించిన ఇంటిని అధికారులు కూల్చివేస్తున్నారు.

గత ఐదు రోజులుగా కురిసిన వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. కనీవినీ ఎరుగని రీతిలో వరద నీరు పోటెత్తింది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో 70 ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.