కవితదే విజయం – కేటీఆర్

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 07:05 AM IST
కవితదే విజయం – కేటీఆర్

KTR Focus On Nizamabad MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS పార్టీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. అన్ని ఎన్నికల్లో మోగిస్తున్నట్లే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో మాజీ ఎంపీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించారు.



ఈ ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపిస్తామన్నారాయన. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి నిజామాబాద్ జిల్లా అండ‌గా నిలుస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ మరోసారి అండగా నిలవాలని కేటీఆర్‌ కోరారు.



గత ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కేటీఆర్‌ కోరారు. ఒకవైపు ప్రాజెక్టులను నిర్వహిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి SRSP ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు కేటీఆర్‌.



కాలువల ఆధునికీకరణ, పూర్వ నిజామాబాద్ జిల్లాలో ప్రాంతాలైన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని కేటీఆర్ తెలిపారు. రైతు సంక్షేమం కోసం అవసరమైతే దేవునితో పోరాడుతామన్న కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ప్రత్యేక నిధుల విషయంలో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని.. ఇందుకు సంబంధించి ఒక పరిష్కారంతో ముందుకువస్తున్నదని అన్నారు.



దీంతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సమస్యలను సైతం తమకు తెలుసని మునిసిపాలిటీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి, తమ తమ వార్డుల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆశీర్వాదంతో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికవుతుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు రాజకీయాలు చేస్తున్నాయని.. కులాలు మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది అని కేటీఆర్ తేల్చిచెప్పారు.