Solar-Roof Cycling Track: ఓఆర్ఆర్‌ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

హైదరాబాద్, ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే వేసవిలోపు ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు.

Solar-Roof Cycling Track: ఓఆర్ఆర్‌ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

Solar-Roof Cycling Track: హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ నిర్మించనున్న సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంగళవారం, నానక్‌రామ్ గూడ వద్ద భూమి పూజ చేసి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

 

మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర, 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను నిర్మంచనున్నారు. ట్రాక్‌కు రెండు వైపులా ఒక మీటరు వెడల్పుతో పచ్చదనం ఉండేలా చూస్తారు. 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని, మొదట నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు… తర్వాత నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం జరగనుంది. అనంతరం ఇది దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. సాధారణ సైకిల్ ట్రాక్ మాదిరిగా కాకుండా, అత్యాధునిక వసతులతో దీన్ని ఏర్పాటు చేస్తారు.

 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘‘అందరికీ ఉపయోగపడే విధంగా ట్రాక్ అందుబాటులోకి తెస్తాం. 24 గంటలూ వినియోగించుకునేలా తీర్చిదిద్దుతాం. ప్రపంచ దేశాలకు ధీటుగా సోలార్ రూఫింగ్ సైకిల్ ట్రాక్ అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో సైక్లింగ్ పోటీలు నిర్వహించేలా నిర్మిస్తాం. వచ్చే వేసవిలోపే అందుబాటులోకి తెస్తాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.