TS-bPASS : 21 రోజుల్లోనే పర్మిషన్లు

  • Published By: madhu ,Published On : November 17, 2020 / 12:00 AM IST
TS-bPASS : 21 రోజుల్లోనే పర్మిషన్లు

KTR launches TS-bPASS : భవన నిర్మాణాలకు, లే అవుట్లకు ఇకపై సులభంగా అనుమతులు రానున్నాయి. కేవలం 21 రోజుల్లోనే పర్మిషన్లు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన టీఎస్ బీపాస్‌ వెబ్ సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు బీపాస్ ద్వారా ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. ప‌ట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు రూపొందించిన‌ టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.



సెల్ఫ్ డిక్లరేషన్ : –
పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్‌తో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేస్తారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాలలోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు. ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారు. ఈ వెబ్‌సైట్‌ తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.



ఆక్రమణలపై కొరడా – కేటీఆర్ : –
తెలంగాణ ప్రజల కోసం TDR బ్యాంక్ ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్థలం కోల్పోయినప్పుడు ఒక సర్టిఫికెట్ తీసుకుని…ఆ హక్కులు వేరొకరికి అమ్మే అవకాశం ట్రాన్స్‌పర్‌బుల్ డెవలప్ మెంట్ రైట్స్‌ వల్ల ఉంటుందని మంత్రి చెప్పారు. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ వల్ల…ఎవరినైనా, ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని మంత్రి తెలిపారు.
అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.



అవినీతికి చెక్ : –
GHMC కొత్త చట్టం ప్రకారం నాలా, చెరువు స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టినా…కూల్చివేస్తామని చెప్పారు. నోటీసులివ్వకుండానే కూల్చివేసే అధికారం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బీపాస్‌ను దుర్వినియోగం చేయొద్దని కోరారు. భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యం లేకుండా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీపాస్‌ను తీసుకువచ్చింది. పర్మిషన్ కోసం వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే క్రమంలో అవినీతికి ఆస్కారం ఉండేది. కానీ.. సింగిల్ విండో విధానంలో పర్మిషన్ ఉంటుంది కాబట్టి… అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తోంది.