తెలంగాణ భారత్‌లో భాగం కాదా?: కేటీఆర్

తెలంగాణ భారత్‌లో భాగం కాదా?: కేటీఆర్

ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖా మంత్రి కేటీఆర్. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని, ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో నగరం అగ్రస్థానంలో ఉందని అన్నారు. కేంద్రం మాత్రం రాష్టం వైపు చిన్నచూపు చూస్తుందని అన్నారు కేటీఆర్. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై ఎన్నోసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నాం.. కానీ పట్టించుకోలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్‌గా ఆలోచిస్తూ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌లపై అన్యాయం చెయ్యొద్దు.. ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలను పక్కనబెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదా? గుజరాత్ వైపే బుల్లెట్ ట్రైన్లు ఎందుకు వెళ్తున్నాయి అని ప్రశ్నించారు కేటీఆర్. దక్షిణాదికి ఒక్క బుల్లెట్ ట్రైన్ రాలేదు.. ఇచ్చిన హామీల అమలుకు కృషి చెయ్యాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయట్లేదని కేటీఆర్ అన్నారు.దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? ప్రశ్నించారు.

వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారని, కోచ్‌ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ రద్దు చేసిన తెలంగాణకు న్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ ఇవ్వలేదని, బయ్యారం ఉక్కు ఊసేలేదన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు.