హంతకులను వదిలిపెట్టం, న్యాయవాదుల దారుణ హత్యపై తొలిసారి స్పందించిన కేటీఆర్

హంతకులను వదిలిపెట్టం, న్యాయవాదుల దారుణ హత్యపై తొలిసారి స్పందించిన కేటీఆర్

ktr reaction lawyer vamanrao couple murder: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిన్న(మార్చి 2,2021) నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో మంత్రి మాట్లాడారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం కృషి చేస్తామని అన్నారు. న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి, వెంటనే తొలగించామని చెప్పారు. హంతకులను వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉన్నారని.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని ఆయన హామీనిచ్చారు.

వామన్‌రావు హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు లాఠీ దెబ్బలు తిన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, నల్ల చట్టాలను తెచ్చిందని ఆరోపించారు.

జీడీపీని పెంచుతామని పెట్రో, గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, తాము మాత్రం ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నామని, ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చామని, న్యాయవాదులంతా ఆమెకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు.

ఫిబ్రవరి 17న లాయర్ వామన్ రావు దంపతులను పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో దారుణంగా నడిరోడ్డుపైనే నరికి చంపారు. కారును చిరంజీవి నడపగా కుంట శ్రీను అతడి పక్కన కూర్చున్నాడు. వీరిద్దరు కారును వేగంగా నడిపి కల్వచర్ల దగ్గర కాపుగాశారు. అక్కడ రోడ్డు మరమ్మతు పనులు జరగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా వస్తాయని తెలిసి..అక్కడే లాయర్ కారుపై అటాక్ చేశారు. వామన్ రావు కారును అడ్డగించి కత్తులతో అద్దాలను ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌ సతీష్‌ భయపడి పారిపోయాడు. వామన్‌రావు డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చి కారు నడిపేందుకు ప్రయత్నించగా బిట్టు శ్రీను అతన్ని బయటకు లాగి కత్తులతో దాడి చేశాడు. చిరంజీవి కారు వెనక సీట్లో ఉన్న నాగమణిపై కత్తితో నరికాడు. అనంతరం చిరంజీవి, శ్రీను ఇద్దరు కలిసి వామన్ రావుపై కత్తులో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపునకు వెళ్లి రక్తంతో తడిసిన దుస్తులను మార్చారు. కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేశారు.

వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, విలోచవరం గ్రామానికి చెందిన చిరంజీతో పాటు బిట్టు శ్రీను పోలీసుల అదుపులో ఉన్నారు. వీరందరు కలిసి వామన్‌వు దంపతులను చంపాలని పక్కాగా స్కెచ్ వేశారు. వీరికి బిట్టు శ్రీను తన కారుతో పాటు కొబ్బరి బొండాలు నరికే రెండు కత్తులను సమకూర్చాడు.