మేమున్నాం..ధైర్యంగా ఉండండి, వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన

  • Published By: madhu ,Published On : October 17, 2020 / 07:25 AM IST
మేమున్నాం..ధైర్యంగా ఉండండి, వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన

KTR tour of flood-affected areas : హైదరాబాద్‌ నగరంలోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట మంత్రి కేటీఆర్ మూడో రోజుల పాటు విస్తృతంగా ప‌ర్యటించారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి భరోసా కల్పించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లను సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఇక వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.



తెలంగాణను భారీ వర్షాలు కుదిపేశాయి. ఎన్నడూ లేనంత రీతిలో వర్షాలు పడడంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రిజర్వాయర్లు, నాలాలు పొంగిపొర్లడంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు బయటికి రావలంటేనే జంకుతున్నారు. అయితే కాస్త వరద ఉధృతి తగ్గడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు మనోధైర్యం కల్పించారు. ఇళ్లు కోల్పోయిన వారిని, వర్షాల ధాటికి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం
ఆదుకుంటుందన్నారు.



ఖైరతాబాద్, బేగంపేట, పటేల్‌నగర్‌లో నీట మునిగిన ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారి కోసం జీహెచ్‌ఎంసీ షెల్టర్ హోంలు ఏర్పాటు చేయగా.. అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముంపు బాధితులకు రేషన్ కిట్లతో పాటు దుప్పట్లను అందజేశారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు షెల్టర్‌ హోంలోనే ఉండాలని.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. కాలనీల్లో నిలిచిన నీరు త్వరగా పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. అలాగే నాలాలను పరిశీలించి.. మళ్లీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.



పారిశుద్ధ్య ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ఒక నెల వేతనాన్ని ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, కంటైన్మెంట్ బోర్డు సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు తమ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని కేటీఆర్‌కు లేఖ అందించారు.