ప్రాణం తీసిన భూ వివాదం : అందరూ చూస్తుండగానే పట్టపగలు వేటాడి హత్య

ప్రాణం తీసిన భూ వివాదం : అందరూ చూస్తుండగానే పట్టపగలు వేటాడి హత్య

Land dispute : man brutally murdered in Nalgonda : పట్టపగలు… రోడ్డుపై జనం తిరుగుతూనే ఉన్నారు… వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు… ఇంతలోనే ఒక్కసారిగా అలజడి. ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు తరుముకుంటూ వచ్చారు.. గ్రామ శివారులో నుంచి గ్రామంలోకి ప్రవేశించారు… జనం కూడా చూస్తూనే ఉన్నారు… ఈ లోపు తరుముకుంటూ వచ్చిన వ్యక్తులకు మరొకరు కనిపించారు…అంతే అతడిని టార్గెట్ చేసుకున్నారు… ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దారుణాన్ని గ్రామంలోని కొందరు చూసినా, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దాయాదుల మధ్య భూవివాదం.. ఓ వ్యక్తి ప్రాణాన్ని తీశాయి…గ్రామంలో అందరూ చూస్తుండగానే… ప్రత్యర్ధి వర్గం… ప్రాణం తీసింది.

మండలం బండతిమ్మాపురం పంచాయతీ పాటిమీదిగూడెం ఆవాస గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా…తండ్రి, కొడుకులపై గ్రామంలో అందరూ చూస్తుండగానే దాయాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన బోదాసు వెంకటయ్యకు, దాయాదులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. పొలం వద్ద ఉన్న వెంకటయ్య కుమారుడు బోదాసు అశోక్‌పై బోదాసు కృష్ణయ్య, అతని కుమారులు విజయ్‌, నాగరాజు, గిరయ్య, వెంకటయ్యలు దాడి చేశారు.

వారి నుంచి తప్పించుకునేందుకు అశోక్ గ్రామంలోకి పరిగెత్తాడు. ఇదే సమయంలో అశోక్ తండ్రి వెంకటయ్య… వారి కంటపట్టాడు. అంతే… అశోక్‌ను వదిలేసి… వెంకటయ్య పైకి వెళ్లారు. పారిపో అంటూ అరుస్తున్నా…ఆయన వినిపించుకోలేదు… కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. అయితే గ్రామస్తులెవరూ ఆయన దగ్గరు వెళ్లి సాయం చేసే ధైర్యం చేయలేదు.

తీవ్ర గాయాలతో రెండు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉన్నాడు. తమపై కూడా దాడి చేస్తారేమోనని స్థానికులు కూడా దూరంగా ఉండిపోయారు. రెండు గంటల తర్వాత అక్కడి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని హుటాహుటిన… వెంకటయ్యను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందారు.