ప్రాణాలు తీసిన నిద్ర.. కాల్వలోకి కారు.. ముగ్గురు మృతి

ప్రాణాలు తీసిన నిద్ర.. కాల్వలోకి కారు.. ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఎస్ఆర్ఎస్‌సీ కాకతీయ కాలువలోకి కారు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.. వరంగల్‌ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరవక ముందే.. అదేమాదిరిగా ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కట్కానేని అమరేందర్‌రావు అనే న్యాయవాది కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు జయంత్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు క్రేన్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కారుతోపాటు మృతదేహాలను వెలికితీశారు. సొంతూరు జోగినపల్లిలో ఉత్సవాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుందామని న్యాయవాది కుటుంబం జగిత్యాల నుంచి కారులో బయలుదేరింది. మేడిపల్లి రాగానే కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే కారు నడుపుతున్న కుమారుడు జయంత్‌ డోర్‌ తీసుకుని బయటపడ్డాడు. మిగతా ముగ్గురు మాత్రం కారులోనే చిక్కుకున్నారు. కాల్వలో నీటి ప్రవాహ వేగానికి కారు కొంత దూరం కొట్టుకుపోయింది.

స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టేలోపే కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె శ్రేయకు ఇటీవల పెళ్లి నిశ్చయం కాగా.. పెళ్లికి కొద్దిరోజుల ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు కాలువలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బంధువులుగా తెలుస్తోంది. మృతదేహాలు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.