లాయర్ దంపతుల హత్య : బ్యారేజీలో కత్తులు దొరికేనా

లాయర్ దంపతుల హత్య : బ్యారేజీలో కత్తులు దొరికేనా

lawyer couple murder : లాయర్‌ వామనరావు దంపతుల హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు.. మంథనిలో వామనరావును దంపతులను అత్యంత దారుణంగా హత్య చేయడానికి నిందితులు కుంట శ్రీను, చిరంజీవి వాడిన మరణాయుధాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.. హత్య చేశాక నిందితులు వాహనంలో వెళ్తూ సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులను పడేశామని తెలపడంతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం కస్టడీలో ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను సుందిళ్ల బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. పడవల సాయంతో బ్యారేజీలో గాలింపు చర్యలు చేపట్టారు.

బ్యారేజ్‌లో ప్రస్తుతం నాలుగు టీఎంసీల నీటిమట్టం ఉంది. 59 నంబర్‌ పిల్లర్ల మధ్య కత్తులు పడేసినట్లు నిందితులు చెప్పడంతో… గజఈతగాళ్లు పది మీటర్ల లోతులో గాలింపు చేపట్టారు. గోదావరిలో కత్తులు రికవరీ చేయడానికి వైజాగ్‌ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు పోలీసులు. అయితే కత్తులు బ్యారేజ్‌లో పడేసి 10 రోజులవుతోంది. దీంతో నీళ్ల అడుగున ఇసుక కిందకు ఆయుధాలు చేరి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు… ఇన్నాళ్లూ నీళ్లలో ఉన్న ఆయుధాలపై రక్తపు మరకలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కత్తులను బయటకు తీయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆయుధాలను వెలికితీయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు పోలీసులు. గజఈతగాళ్లతో పాటు.. పెద్ద పెద్ద అయస్కాంతాలను కూడా ఉపయోగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇటు కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను పోలీసులు భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు బిట్టు శ్రీనును కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను ప్రశ్నించిన పోలీసులు…లాయర్‌ దంపతుల హత్యకు రాజకీయ ప్రమేయం లేదని, అందుకు సంబంధించిన ఆధారాలేమీ ఇంతవరకు లభించలేదని అంటున్నారు.

అరెస్ట్‌ చేసినప్పుడు తొలిసారి వెల్లడించిన అంశాలనే కస్టడీలోనూ పునరావృతం చేస్తున్నారట నిందితులు. గ్రామంలో గొడవలు, వ్యక్తిగత కక్షలతోనే కుంటశ్రీను, బిట్టు శ్రీను కలిసి వామనరావు దంపతుల హత్యకి ప్లాన్‌ చేశారనేది పోలీసుల వాదనగా ఉంది. బిట్టు శ్రీనుకు వామనరావు దంపతులు అంటే ఎందుకు అంత కక్ష? అనే కోణంలో మరోసారి విచారణ జరపనున్నారు పోలీసులు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా…ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమగ్ర విచారణ జరుపుతున్నామంటున్నారు రామగుండం కమిషనరేట్ పోలీసులు.