పెద్దపల్లికి బండి సంజయ్, విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు

పెద్దపల్లికి బండి సంజయ్, విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు

Vaman Rao Murder : న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య రాజకీయ దుమారం రాజేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు పట్టపగలే వామన్‌రావు దంపతులను దారుణంగా హత్య చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నారు వామన్‌రావు దంపతులు. వామన్‌రావు దంపతుల హత్యకు కారకులైన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ డిమండ్ చేసింది. హత్యలను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నారు.

వామన్‌రావు దంపతుల హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారాయన. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పెద్దపల్లి వెళ్లనున్నారు బండి సంజయ్. మరోవైపు…నిందితుడు మంథని మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌, అతడి అనుచరులు అక్కపాక కుమార్‌, వసంతరావు ప్రోద్బలంతో ఈ హత్యలకు పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ ముగ్గురుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు పోలీసులు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ముగ్గురు డీసీపీలతో ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
నిందితుల్ని ఇప్పటికే గుర్తించామన్న హోం మంత్రి మహమూద్‌ ఆలీ.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడిన హోంమంత్రి…ఈ కేసు దర్యాప్తును త్వరగా కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు.