ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్‌ ప్లీజ్… ఎన్నిసార్లు ఓడినా ఫ్యూచర్‌పై కరీంనగర్‌ జిల్లా నేతలకు తగ్గని ఆశ

  • Published By: naveen ,Published On : October 29, 2020 / 01:22 PM IST
ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్‌ ప్లీజ్… ఎన్నిసార్లు ఓడినా ఫ్యూచర్‌పై కరీంనగర్‌ జిల్లా నేతలకు తగ్గని ఆశ

assembly elections: గెలుపు రుచి చూడడానికి చాలామంది నేతలు విఫలయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజా సేవలో ఉన్నవారు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కాకపోతానా అనుకుంటుంటారు. మారిన రాజకీయాల నేపథ్యంలో పార్టీల సంఖ్య పెరుగుతోంది. పోటీ చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా విజయం సాధించిన వారంతా ఎమ్మెల్యే కావాలనే టార్గెట్‌తో రాజకీయాలు చేస్తుంటారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ల కోసం పోటీపడే వారి కారణంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం ఆయా పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారుతోంది.

ప్రతి ఎన్నికల్లో పోటీలో కౌశిక హరి, రాజ్ ఠాకుర్ మక్కాన్ సింగ్‌:
రామగుండం నియోజకవర్గం నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీలో చేయడం కౌశిక హరి, రాజ్ ఠాకుర్ మక్కాన్ సింగ్‌లకు అలవాటైపోయింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవాలనేది వారి కోరిక. అందుకోసం నిత్యం ప్రజల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల నాటికి స్థానికంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వారి అంచనాలను మార్చేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే కావాలనే కోరికను చంపుకోలేక మరో ఎన్నికల్లో విజయం సాధించకపోతామా అనే ఆశతో ఎదురు చూస్తుండడం పరిపాటి అయిపోయిందంటున్నారు.

ఎట్టకేలకు ఎమ్మెల్యే అయిన చందర్:
గతంలో రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కోరుకంటి చందర్‌ను ఎట్టకేలకు ప్రజలు ఆశీర్వదించడంతో ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఓటమి చవిచూసిన ఇద్దరు నేతలు కూడా భవిష్యత్‌పై ఆశలతో రాజకీయల్లో కొనసాగుతున్నారు. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ప్రతి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీనిస్తున్నా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. అయినా నిరుత్సాహ పడకుండా పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తనదే అనే ధీమాతో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

కేటీఆర్‌ ప్రత్యర్థిగా బరిలో నిలిచే కేకే మహేందర్‌రెడ్డిని వరించని గెలుపు:
కోరుట్ల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుకు కాలం కలసి రావడం లేదంట. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైనా వెనుకడుగు వేయకుండా వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. సిరిసిల్ల నుంచి ప్రతి ఎన్నికల్లో కేటీఆర్‌ ప్రత్యర్థిగా బరిలో నిలిచే కేకే మహేందర్‌రెడ్డిని గెలుపు వరించడం లేదు. వేములవాడ నుంచి పోటీ చేసే ఆది శ్రీనివాస్ కూడా గెలుపునకు చేరువలో ఓటమి పాలవుతున్నారు.

కౌశిక్‌రెడ్డికి కాలం కలసి రావడం లేదు:
ఇక హుజూరాబాద్ నుంచి టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డికి కాలం కలసి రావడం లేదు. మంత్రి ఈటెల రాజేందర్‌పై పోటీ చేసి ఓటమి పాలవుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఏదో ఒకరోజు విజయం సాధిస్తాననే ధీమాతో బరిలో దిగుతూనే ఉన్నారట. చొప్పదండి నియోజకవర్గం నుంచి మేడిపల్లి సత్యం సైతం ఓటమి పాలవుతున్న నేతల్లో ఒకరు. మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి తనయుడు సునీల్ రెడ్డికి రాజకీయంగా కలసి రావడం లేదంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్యేగా గెలవాలనేది సునీల్‌రెడ్డి ఆశయంగా చెబుతున్నారు.

ఒక్క చాన్స్‌ అడుగుతున్న నేతలకు టైమ్‌ ఎప్పుడు కలిసొస్తుందో?
వరుస ఓటములతో కుమిలిపోకుండా పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. వారిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలవాలంటే రిజర్వరేషన్లతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలు, పార్టీ బలం అన్నింటి కంటే ప్రధానంగా ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. ఇవన్నీ కలిసొస్తే ఏదో ఒక రోజు విజయం వరించడం ఖాయమనేది చాలామంది నేతల విషయంలో రుజువైంది. మరి ఈ ఒక్క చాన్స్‌ అడుగుతున్న నేతలకు టైమ్‌ ఎప్పుడు కలిసొస్తుందో?