ఉచిత మంచి నీరు అందేనా ? ఇబ్బందిగా మారిన ఆధార్‌ లింక్‌

ఉచిత మంచి నీరు అందేనా ? ఇబ్బందిగా మారిన ఆధార్‌ లింక్‌

Free Fresh water Scheme : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఉచిత తాగునీటిని నగరవాసులకు సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్నట్టుగానే జనవరి 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. తమకు ఉచితంగా నీరు అందుతుందని గ్రేటర్‌ ప్రజలు భావించారు. అయితే తమ అశలు ఆడియాసలే అవుతున్నాయంటున్నారు నగర వాసులు. ఉచిత మంచినీటి పథకం పట్ల గ్రేటర్ వాసులు నిరాశ చెందడానికి కారణాలేంటి..?

ఉచిత మంచినీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. ప్రతీ కుటుంబానికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేయడం, ఆ తర్వాత వినియోగించే నీటికి బిల్లులు వసూలు చేయడం ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో గ్రేటర్‌ వాసులు అయోమయానికి గురవుతున్నారు. ఇక ఉచిత మంచినీటి పథకానికి అర్హులు కావాలంటే నల్లా కనెక్షన్‌కి మీటరు ఉండాలి. ఆ తర్వాత నల్లా కనెక్షన్‌ని ఆధార్‌తో అనుసంధానం చేయాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులు అవుతారు.

ఆధార్‌కార్డును నల్లా కనెక్షన్‌తో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలి. దీని కోసం నల్లా అకౌంట్ నంబర్‌, ఆధార్‌ నంబర్‌తో పాటు ఓటర్‌ కార్డ్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఫొటో ఐడెంటిటీ కార్డులను జత చేయాల్సి ఉంటుంది. ఫొటో గుర్తింపు కార్డు లేనట్టయితే గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మార్చి 31లోగా ఆధార్‌ లింక్‌ చేసిన వాళ్లకే ఈ పథకం వర్తిస్తుంది. స్లమ్ ఏరియాల్లో ఉండే కుటుంబాలకు ఈ ఆధార్‌ లింక్‌ అనేది కష్టంగా మారింది. అందువల్లే ఇప్పటికే సగం గడువు పూర్తయినా కేవలం 30 వేల కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో లింక్‌ అయ్యాయి.

రెండు అంతకు మించి ఎక్కువ కుటుంబాలు నివసించే భవనాలు, అపార్ట్‌మెంటులు, గేటెట్‌ కమ్యూనిటీల విషయంలో ఉచిత మంచినీటి పథకం వర్తింపుపై స్పష్టత ఇవ్వడం లేదు వాటర్‌ బోర్డు అధికారులు. పెద్ద భవంతుల్లో నీటిని నిలువ చేసేందుకు సంప్‌ లేదా వాటర్‌ ట్యాంక్‌ ఒకటే ఉంటుంది. దీని వల్ల అక్కడ మంచినీటి కనెక్షన్లు తక్కువగా ఉంటే నివసించే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఉచిత నీరు పొందాలంటే ఎవరెవరు కనెక్షన్‌ తీసుకోవాలనే దానిపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎటూ తేల్చడం లేదు.

ఇక నల్లా కనెక్షన్లకు తోడు మరో సమస్య మీటర్ల బిగింపు. నగరంలో 10 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉంటే కేవలం రెండున్నర లక్షల మందికి మాత్రమే నల్లా మీటర్లు ఉన్నాయి. అందులోనూ 30శాతం వరకు మీటర్లు పని చేయడం లేదంటున్నాయి వాటర్ బోర్డు వర్గాలు. అంటే మురికి వాడలు మినహాయిస్తే మరో 5 నుండి 6 లక్షల వరకు వాటర్‌ మీటర్లు అవసరం పడుతున్నాయి.

మీటర్లను వినియోగదారులే ఏర్పాటు చేసుకోవాలంటోంది వాటర్ బోర్డు. అవికూడా బోర్డు గుర్తించిన ఏజెన్సీల నుండి మాత్రమే కోనుగోలు చేయ్యాలని సూచిస్తోంది. ప్రతీ మీటర్‌కు కనీసం 15 వందల నుండి గరిష్టంగా 2వేల రూపాయలు ఖర్చు అవుతోంది. దాన్ని బిగించేందుకు మరో 15 వందల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక్కో కనెక్షన్‌పై 3 వేల రూపాయల వరకు భారం పడనుంది.

ఇక గ్రేటర్లో 1475 స్లమ్స్‌ మాత్రమే నోటిఫై అయిఉన్నాయి, ఇంకా నోటిఫై కాని స్లమ్స్ చాలా ఉన్నాయి అక్కడ ఎలా నీరు అందిస్తారనేదానిపై క్లారీటి ఇవ్వడం లేదు అధికారులు. ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేవరకు ఎంతమందికి ఉచిత త్రాగునీరు అందుతుందో చూడాలి.