మద్యం ఆదాయం రూ.15వేల కోట్లు

మద్యం ఆదాయం రూ.15వేల కోట్లు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు డిమాండ్ ఫుల్లుగా పెరిగిపోయింది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఏకంగా రూ.24వేల 814 కోట్ల విలువైన మద్యం అమ్మేశారు. ఇందులో వ్యాట్‌ కాకుండా రూ.15 వేల కోట్లకుపైగా ఎక్సైజ్‌ శాఖకు ఆదాయం వచ్చిపడింది. లిక్కర్‌ బాటిళ్ల వారీగా చూస్తే.. ఈ 11 నెలల కాలంలో 2.4 కోట్ల కేసుల బీర్లు, 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్‌ విక్రయాలు నమోదుకావడం గమనార్హం.

టార్గెట్ రీచ్ కాలేదు
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి.. రాష్ట్ర ప్రజలతో పాటు కరోనా ధాటిగా ప్రభావం కనిపించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్సైజ్‌ ఆదాయ అంచనాలు మాత్రం లక్ష్యం చేరుకునే దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ రాబడుల కింద రూ.16 వేల కోట్లు సమకూర్చుకోవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంకో నెల ముందుగానే రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది.

ఒక్క నెలలో కథ వేరే ఉంటది
మార్చిలో మిగతా వెయ్యి కోట్లకన్నా ఎక్కువ రాబడే ఉంటుందని అంచనా. గతేడాది లాక్‌డౌన్‌ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగలేదు. ఆ సమయంలో వైన్‌షాపులు, బార్లు తెరిచి ఉంటే అదనంగా మరో 2వేల కోట్ల మేర ఆదాయం వచ్చేదని ఎక్సైజ్‌ శాఖ అధికారుల అంచనా. మొత్తం మీద జీఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్లు వంటి కీలక రంగాల నుంచి ఆదాయం తగ్గినా.. మద్యం రాబడి పెరగడంతో ఖజానాకు ఇబ్బంది తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్ – 8.22 లక్షల లీటర్ల లిక్కర్‌
11 నెలల పాటు జరిగిన విక్రయాలను చూస్తే.. 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్, 2.4 కోట్ల కేసులకుపైగా బీర్లు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్‌ తాగేస్తున్నారు. గత 334 రోజుల్లో లిక్కర్, బీర్లు కలిపి రోజుకు 14 లక్షల లీటర్ల వరకు తాగారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్‌ అమ్ముడయ్యాయి. వీటి విలువ 2వేల 727 కోట్లు.

ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లింది. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి. మార్చిలో మద్యం విక్రయాలు మళ్లీ పెరుగుతాయని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి.