దొరికిన కాడికి దోచుకోవటమే… క్వార్టర్ @ 300

  • Published By: chvmurthy ,Published On : March 31, 2020 / 04:28 AM IST
దొరికిన కాడికి దోచుకోవటమే… క్వార్టర్ @ 300

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందు బాబులకు గత 8 రోజులుగా మద్యం దొరక్కపోవటంతో పిచ్చెక్కినట్టు ఉంటోంది. ఒకరిద్దరు మందుబాబులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరికొందరైతే ఆత్మహత్యాయత్నం చేశారు. మందు బాబుల అవసరాలే  తమకు లక్కీ చాన్స్‌ అనుకుని బెల్టు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. 

వైన్ షాపులు  మూసివేయడంతో   బెల్ట్ షాపు నిర్వాహాకులు వారు ధరలు పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. అసలే మద్యం లభించని ఈ సమయంలో దొరికిందే అమృతంగా భావించి మద్యం ప్రియులు కొనుగోలు చేస్తున్నారు. కొందరేమో ఆ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు.  ఎమ్మార్పీ కన్నా రెండు, మూడింతలు అధికంగా విక్రయిస్తూ మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

మద్యం దుకాణాల్లో  క్వార్టర్‌ మద్యం  రూ.120 ఉండగా ప్రస్తుతం గ్రామాల్లో రూ.300 నుంచి రూ.400కు అమ్ముతున్నారు. దీంతో మద్యంప్రియులు తప్పని పరిస్థితుల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్యం దుకాణాదారులు  నిల్వలను ఒక చోట దాచిపెట్టి  బెల్టు దుకాణాల నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినికిడి. అయితే వైన్స్‌ మూసి ఉండడంతో ఒక్కసారిగా బెల్టు దుకాణాల నిర్వాహకులు తమకు దొరికిందే అవకాశమని భావించి విక్రయాలను కూడా బాహాటంగా చేస్తున్నారు. 

ఇంత జరుగుతున్నా దీన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సంబంధిత అధికారులతోపాటు మద్యం దుకాణాదారులు, బెల్టుషాపుల నిర్వాహకులు కుమ్మక్కు అయి ఈ దందా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం దుకాణాల మూతతో బెల్టు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక జిల్లాల్లో ఇదే తంతు కొనసాగుతోంది.  అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మద్య ప్రియులు కోరుతున్నారు.

Also Read | నెలాఖరు.. నగదు నిల్వలు చూసుకోండి : కేంద్రం సూచనలు