గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి : సీఎం కేసీఆర్ 

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 04:23 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి : సీఎం కేసీఆర్ 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయ చర్యలపై ఆయన బుధవారం (మే 6, 2020) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, దాని చుట్టు పక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. 

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు.  కాబట్టి హైదరాబాద్ పై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు.హైదరాబాద్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదన్నారు. బయటి వారు హైదరాబాద్ కు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. నియంత్రణ చర్యలు పకడ్బందిగా చేపట్టాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. చురుకైన పోలీసు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు.

ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో పత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ఏపీ నుంచి ఎవరూ రాకూడదు…ఎవరూ వెళ్లకూడదన్నారు. ప్రజల రాకపోకలను నియంత్రించగలిగితే వైరస్ ను అరికట్టవచ్చన్నారు.