దీక్షిత్ ఎక్కడ : తల్లి వసంతకు కిడ్నాపర్ల ఇంటర్నెట్ కాల్

  • Published By: madhu ,Published On : October 21, 2020 / 10:28 AM IST
దీక్షిత్ ఎక్కడ : తల్లి వసంతకు కిడ్నాపర్ల ఇంటర్నెట్ కాల్

Mahabubabad Kidnap Mystery Dixit : మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. పది పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలిస్తున్న ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం 6గంటలకు ఫోన్‌ చేసి డబ్బులు ఎక్కడ ఇవ్వాలో చెబుతామన్నారు. కానీ అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి ఫోన్‌కాల్స్‌ లేకపోవడంతో… కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అనూహ్యంగా..2020, అక్టోబర్ 20వ తేదీ మంగళవారం రాత్రి బాలుడి తల్లి వసంతకు ఇంటర్నెట్ కాల్ చేశారు కిడ్నాపర్లు. డబ్బులు రెడీ చేసుకోవాలని కిడ్నాపర్లు చెప్పగా..తమకు తోచినంత ఇస్తామని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. ఇదిలా ఉంటే..బాలుడి తండ్రి సన్నిహితులు, స్నేహితులపై పోలీసులకు అనుమానాలు పెరుగుతున్నాయి.



ఆదివారం సాయంత్రం ఇంటిముందు స్నేహితులతో ఆడుకుంటున్న దీక్షిత్‌రెడ్డి.. అపహరణకు గురయ్యాడు. సాయంత్రం ఆరు గంటలకు బాలుడు అదృశ్యమవగా.. రాత్రి 9 గంటలకు కిడ్నాపర్ల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం ఏడుసార్లు ఫోన్‌ చేశారు. రూ. 45 లక్షలు ఇస్తేనే బాలుడిని సురక్షితంగా పంపిస్తామని.. లేకుంటే బాలుడి ప్రాణాలకే ముప్పని కిడ్నాపర్లు హెచ్చరించారు.
https://10tv.in/still-mystery-continues-in-deekshith-kidnap-case/
కిడ్నాపర్లు బాలుడిని పక్కాగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలోని 144 సీసీ కెమెరాల్లో ఏ కెమెరాకు చిక్కకుండా బాలుడిని అపహరించుకుపోయారు. దీంతో ఈ కిడ్నాప్‌ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. కిడ్నాపర్‌ బాలుడి తల్లిదండ్రులకు అత్యంత సన్నిహితుడే అని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.



పోలీసులు తమ దర్యాప్తుల్లో చిన్న క్లూని కనిపెట్టారు. కృష్ణ కాలనీలోని ఒక వీధిలో… బాలుడిని కిడ్నాప్‌ చేసుకుని బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అవి స్పష్టంగా లేకపోవడంతో… బైక్ వెళ్లిన ఆధారంగా పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. బాలుడి తండ్రి రంజిత్‌కు పరిచయాలు ఉన్న వారితోనూ విచారణ చేపట్టారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి తాను ఎక్కడున్నాడో తెలియకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఇంటర్నెట్‌ కాల్‌ చేస్తున్నాడు.

రంజిత్‌రెడ్డి బాబాయి కుమారుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత బెదిరింపు కాల్స్‌ బంద్‌ అయ్యాయి. చిటీల డబ్బుల వసూలు కోసం మనోజ్‌ను రంజిత్‌రెడ్డి నియమించుకున్నాడు. అయితే దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ అయిన రోజు మనోజ్‌ ఫ్రెండ్‌ బైక్‌పై వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మనోజ్‌కు, అతడి ఫ్రెండ్‌కు ఈ కిడ్నాప్‌తో ఏమైనా సంబంధం ఉందా? లేక మనోజే ఈ కిడ్నాప్‌ గేమ్‌ ఆడుతున్నాడా ? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.



సైబర్‌ క్రైమ్‌కు సంబంధించిన నలుగురు నిపుణులు ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుండగా… పది ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఇద్దరు డీఎస్పీలు, 8మంది సీఐలు, 15మంది ఎస్సైలు, 100మంది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే మహబూబాబాద్‌ పరిసరాల్లోనే బాలుడిని కిడ్నాపర్లు బంధించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత వరకు త్వరితగతిన కేసు మిస్టరీని చేదించేందుకు పోలీసు బృందాలు శ్రమిస్తున్నాయి. కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.