Dead Body In Fridge : హత్య చేసి ఫ్రిడ్జిలో కుక్కిన కేసు.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్.. భార్య పనేనా?

ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా డెడ్ బాడీని ఫ్రిడ్జిలో కుక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్మికనగర్ లో చోటు చేసుకున్న ఈ హత్య సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Dead Body In Fridge : హత్య చేసి ఫ్రిడ్జిలో కుక్కిన కేసు.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్.. భార్య పనేనా?

Dead Body In Fridge

Dead Body In Fridge : ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా డెడ్ బాడీని ఫ్రిడ్జిలో కుక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్మికనగర్ లో చోటు చేసుకున్న ఈ హత్య సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం(ఏప్రిల్ 1,2021) వెలుగుచూసిన మహ్మద్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌ హత్య కేసు మిస్టరీ దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ హత్య వెనుకున్నది మృతుడి భార్యే అనే తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వెనుకే వచ్చాడు..సంచితో వెళ్లాడు:
హత్యకు పాల్పడిన నిందితుడితోపాటు, మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్‌ కార్మికనగర్‌లో ఓ అపార్టుమెంటులో ఉండే టైలర్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌(38) మార్చి 30న ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. శ్రీరాంనగర్‌లోని బావమరిది ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన అహ్మద్.. అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వచ్చాడు. అతని వెనుకే గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది. అతను తిరిగి 31న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో హతుని ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్టు, ఆ సమయంలో ఓ సంచిని ఎత్తుకెళ్లినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా:
ఉదయం 5.45 గంటల సమయంలో కార్మికనగర్‌ చౌరస్తా కూడలి వరకు వచ్చిన అతను తర్వాత ఎటు వెళ్లాడనేది గుర్తించలేకపోయారు. హతుని ఇంట్లోంచి ఎత్తుకెళ్లి సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు మెహిదీపట్నం చౌరస్తాలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం(ఏప్రిల్ 2,2021) తెల్లవారుజామున గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు అలీగా నిర్ధారించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను, రక్తపు మరకల్ని తుడిచేసిన దుస్తులను నిందితుడు సంచిలో పెట్టుకుని వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు, దాని కోసం ఆరా తీస్తున్నారు.

నిందితుడికి, హతుడి భార్యకు మధ్య ఫోన్‌ కాల్స్‌:
తన సోదరుడికి, భార్య రుబినాకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఆమె తరఫు వారే హత్య చేసి ఉంటారని మృతుని సోదరుడు ఫిర్యాదులో తెలిపిన నేపథ్యంలోనే పోలీసులు రుబీనాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. హత్య జరగడానికి ముందు రుబీనా ఫోన్‌ నుంచి అలీకి, హత్య అనంతరం అలీ ఫోన్‌ నుంచి రుబీనాకు కాల్స్‌ వెళ్లినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ దిశగా పోలీసులు ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు పోలీసులు.

దుర్వాసనతో వెలుగుచూసిన దారుణం:
కార్మికనగర్ కు చెందిన సిద్ధిఖ్.. టైలర్ గా పని చేస్తాడు. అతడికి భార్య రుబీనా ఇద్దరు పిల్లలు. సిద్ధిఖ్.. తొలుత అమీర్ పేటలో టైలర్ షాప్ నడిపించేవాడు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షాప్ మూసివేసి ఇటీవలే కూకట్‌పల్లి ప్రాంతంలో మరో షాపు ఓపెన్ చేశాడు. కాగా, మార్చి 30న తన ఇంట్లోనే సిద్ధిఖ్ దారుణ హత్యకు గురయ్యాడు. కడుపులో కత్తితో పొడిచారు. తలపై బలంగా కొట్టారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఫ్రిడ్జిలో కుక్కేశారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు.

ఫ్రిడ్జిలో డెడ్ బాడీ:
హత్యకు రెండు రోజుల ముందే అతడి భార్య తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సిద్ధిఖ్ హత్య విషయం ఎవరికీ తెలీదు. అయితే, ఫ్లాట్‌ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఆ ఫ్లాట్ మొత్తం గాలించగా.. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చివరికి అనుమానం వచ్చి ఫ్రిజ్‌ తెరిచి చూడగా షాక్ తిన్నారు. అందులో డెడ్ బాడీ ఉంది. అలా.. ఈ మర్డర్ బయటపడింది.