ఇంకా దొరకని నవీన్ ఆచూకీ, 16 గంటలుగా సరూర్‌నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 11:10 AM IST
ఇంకా దొరకని నవీన్ ఆచూకీ, 16 గంటలుగా సరూర్‌నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

చిన్నారి సుమేధ ఘటన కళ్లముందు కదలాడుతుండగానే.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో మరో గల్లంతు ఘటన రిపీట్ అయింది. నవీన్ బాబు(46) అనే ఎలక్ట్రీషియన్ వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన నవీన్ కోసం 15గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సెర్చ్ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

కానీ ఎక్కడా నవీన్ బాబు ఆచూకీ దొరకలేదు. నిన్న(సెప్టెంబర్ 20,2020) సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య నవీన్ ఓ స్కూటివాలాకు సాయం చేస్తూ వరదలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అదే వరదలో కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు.



అర్థరాత్రి 3 గంటల వరకు గాలింపు చేపట్టిన రెస్క్యూ టీమ్.. భారీ వర్షం, చీకటితో గాలింపు నిలిపివేసింది. చెరువులో ఉన్న బురద, చెత్తాచెదారం గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తుండడంతో వాటిని కూడా రెస్క్యూ సిబ్బంది తొలగిస్తోంది. ప్రస్తుతం మూడు బోట్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

మరో వ్యక్తికి సాయం చేస్తూ గల్లంతు:
రెస్క్యూ సిబ్బంది నవీన్ కోసం గాలిస్తున్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దగ్గరుండి ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు కూడా స్పాట్‌లోనే ఉన్నారు. నిన్న రాత్రి ఘటనా స్థలంలో భారీగా వర్షం కురిసింది. దీంతో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. నవీన్ తన యజమానిని కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా గల్లంతయ్యాడు.



ఓ స్కూటీని వెనక నుంచి నెడుతూ కిందపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నాయి. అయితే స్కూటీవాలా అక్కడినుంచి వెళ్లిపోగా.. నవీన్ మాత్రం నీళ్లలో పడిపోయి వరదలో కొట్టుకుపోయాడు. నవీన్ జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నవీన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నవీన్ గల్లంతయ్యాడని ఆయన భార్య శాలినీ ఆవేదన వ్యక్తం చేసింది.

నాలాగా మార్చి చేతులు దులుపుకున్న అధికారులు:
లింగోజిగూడ డివిజన్‌ పరిధిలోని ఎగువ ప్రాంతాలైన భాగ్యనగర్, విజయపురి, ధర్మపురి, సాయినగర్, శ్రీరాంనగర్, బైరామల్‌గూడ చెరువు నుంచి వచ్చే వరద నీరు సాఫీగా సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌లోకి వెళ్లేందుకు.. తపోవన్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 6ను మూడేళ్ల క్రితం సర్కిల్‌ అధికారులు నాలాగా మార్చారు. ఈ క్రమంలో సరూర్‌నగర్‌ చెరువుకు గండి పెట్టి వరద నీటిని చెరువులోకి మళ్లించి చేతులు దులుపుకున్నారు. దీంతో చిన్నపాటి వర్షం పడినా రహదారిపై వరద ఏరులై పారుతోంది.



వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించకుండా రహదారిని నాలాగా మార్చడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.