కాళ్ల మీద పడ్డా..కనికరించలేదు..మావోయిస్టులు చంపేశారు

  • Published By: madhu ,Published On : October 11, 2020 / 10:13 AM IST
కాళ్ల మీద పడ్డా..కనికరించలేదు..మావోయిస్టులు చంపేశారు

Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినిపించుకోలేదు..తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు..తొలుత మావోయిస్టులు నా భర్తను కర్రతో కొట్టారు..తర్వాత కత్తితో పొడిచారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.



ములుగులో మావోయిస్టుల ఘాతుకం. వెంకటాపురం మండలం అలుబాకలో టీఆర్ఎస్ నేతను మావోయిస్టుల హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న భీమేశ్వరరావును బయటకు తీసుకొచ్చి..కత్తితో పొడిచి చంపేశారు. హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నారని సమాచారం. ఘటనాస్థలంలో ఓ లేఖను వదిలివెళ్లారు. టీఆర్ఎస్, బీజేపే నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.



దీనిపై పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫండ్ అడిగితే..ఇవ్వలేదని మావోయిస్టులు హత్య చేశారని, పోలీస్ ఇన్ ఫార్మర్ల నెపంతో సామాన్యులను చంపేస్తున్నారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గణపత్ రావు తెలిపారు. గిరిజనులను అభివృద్ధి కార్యక్రమాలకు మావోయిస్టులు దూరం చేస్తున్నారని, రోడ్లను తవ్వి సామాన్య ప్రజానీకానికి ఆటంకం కలిగిస్తున్నారని వెల్లడించారు.



ఇటీవలే ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించిన కొద్ది రోజులకే మావోయిస్టులు నేతను హత్య చేయడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో CRPF బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.



ఈ నేపథ్యంలోనే వెంకటాపురంలో పోలీసులు ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండు నెలల కాలంలో డీజీపీ మహేందర్‌రెడ్డి రెండోసారి ఏజెన్సీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.