Megha Engineering Company : మేఘా ఇంజినీరింగ్ సంస్థ మరో రికార్డు..

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మరో రికార్డు సృష్టించింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల్ని ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చింది.

Megha Engineering Company : మేఘా ఇంజినీరింగ్ సంస్థ మరో రికార్డు..

Megha Engineering Company Another Record

Megha Engineering Company : మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మరో రికార్డు సృష్టించింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల్ని ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి మేఘా సంస్థ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీన్ని రూపొందించారు.

అహ్మదాబాద్‌లోని కలోల్ చమురు క్షేత్రంలో డ్రిల్లింగ్ కార్యకలాపాల్ని ప్రారంభించినట్లు మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి తెలిపారు. 1500 హెచ్‌పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు… భూ ఉపరితలం నుంచి 4 కిలోమీటర్లు లోతు వరకు చమురు బావుల్ని సులభంగా తవ్వుతుంది. మేఘా ఈ రిగ్గును 40ఏళ్లపాటు పనిచేసేలా తయారు చేసింది. ఈ రిగ్గు చమురు బావుల్ని వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్‌తో పనిచేస్తుంది. దీన్ని పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్, ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు.

6వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గుల్ని తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసీ నుంచి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్‌లోని కలోల్‌ చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీస్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్‌ ఓవర్ రిగ్గులు… 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు ఉన్నాయి. మొత్తం 47 రిగ్గుల్లో గుజ‌రాత్‌లో ఒక‌టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాగా… రెండో రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గుల్లో… రెండు రిగ్గులు రాజ‌మండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ ద‌శ‌లో ఉండగా… మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసీ చమురు క్షేత్రాలకు మేఘా ఇంజినీరింగ్‌ అందించనుంది.

చమురు బావుల్ని డ్రిల్‌ చేయడం ద్వారా భవిష్యత్‌లో ఆధునిక టెక్నాలజీ సాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి తెలిపారు. మేఘా సంస్థ మేకిన్ ఇండియా నినాదాన్ని త‌న విధానంగా మార్చుకుందన్నారు. చ‌మురు, ఇంధ‌నం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివ‌ర‌కు విదేశాల‌పైనే ఆధార‌ప‌డ్డ భార‌త్‌కు… మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిర‌ణంగా మారిందన్నారు. రిగ్గుల త‌యారీలో విదేశీ సంస్థల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో రిగ్గుల్ని త‌యారు చేసిన ఘ‌న‌త మేఘా సొంతం చేసుకుందని రాజేశ్‌రెడ్డి చెప్పారు.