మెట్రో బిజినెస్ : ఫుట్ పాత్ మార్గంలో దుకాణాలు, ఆదాయాన్ని ఆర్జించేందుకు

మెట్రో బిజినెస్ : ఫుట్ పాత్ మార్గంలో దుకాణాలు, ఆదాయాన్ని ఆర్జించేందుకు

Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్‌ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్‌పాత్‌ మార్గంలో వీధి వ్యాపారాలు ఏర్పాటు చేస్తూ.. వాళ్లకి ఉపాధి కల్పించడంతో పాటు అటు ఆదాయాన్ని అర్జించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మెట్రో రైల్‌ రాకతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. అటు ట్రాఫిక్ కష్టాలను తప్పించడంతో పాటు ఇటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించింది.

అదే విధంగా చిరు వ్యాపారులకు బాసటగా నిలిచేందుకు మరో నిర్ణయం తీసుకుంది. మెట్రో మార్గాల్లోని ఫుట్‌పాత్‌లను అందంగా రూపుదిద్దిన సంస్థ.. ప్రతీ కిలోమీటర్‌కు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడంతో పాటు నిర్వహణ భారం కాకుండా ఉండేందుకు ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. చిరు వ్యాపారులకు లీజుకిస్తూ.. ఆదాయాన్ని రాబడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ ప్రాంతాల్లోని స్టేషన్ల వద్ద కొన్ని షాపులు అందుబాటులోకి వచ్చాయి. రాయదుర్గం, హైటెక్ సిటి, అమీర్ పేట్, పరేడ్ గ్రౌండ్, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న పుట్ పాత్‌లపై షాపులకు కియోస్కులు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లోని షాపులను జీ ప్లస్ వన్ పద్దతిలో నిర్మాణం చేశారు.

100 చదరపు అడుగుల నుండి 250 చదరపు అడుగుల వరకు ఆకట్టుకునే రీతిలో ఈ షాపులు ఏర్పాటు చేశారు. వీటిలో వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తుంది మెట్రో యాజమాన్యం. ప్రస్తుతానికి జనాలు ఎక్కువగా లేకపోవడంతో.. బిజినెస్ అంతంతమాత్రంగానే నడుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సిటీలో రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి ఫుట్‌పాత్‌ల విస్తీర్ణం ఉంటుంది. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ – ఐఆర్‌సీ నిబంధనల ప్రకారం దుకాణాల ముందు 4.5మీట‌ర్ల వెడ‌ల్పు, బ‌స్ స్టాపుల్లో 3 మీట‌ర్లు, క‌మ‌ర్షియ‌ల్ తో పాటు మిక్డ్స్ ఏరియాల్లో రెండున్నర మీట‌ర్లు ఉండాలి. అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా పాదచారుల కోసం క‌నీసం 1.8 మీట‌ర్ల వెడ‌ల్పు ఫుట్‌పాత్‌లు ఉండాలి. అయితే మెట్రో అధికారులు ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని షాపుల వద్ద స్థలం తక్కువగా ఉండడంతో.. పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరిస్తే.. ఎలాంటి కష్టాలు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.