మూసాపేట్ మెట్రోస్టేషన్ దగ్గర భారీగా కుంగిన రోడ్డు, ప్రమాదంలో మెట్రో పిల్లర్, భయాందోళనలో ప్రయాణికులు

  • Published By: naveen ,Published On : October 14, 2020 / 04:38 PM IST
మూసాపేట్ మెట్రోస్టేషన్ దగ్గర భారీగా కుంగిన రోడ్డు, ప్రమాదంలో మెట్రో పిల్లర్, భయాందోళనలో ప్రయాణికులు

metro rail pillar damage: కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ని ముంచెత్తిన భారీ వర్షాలు నగరవాసులను బెంబేలెత్తించాయి. ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల రోడ్లు కుంగిపోయాయి. తాజాగా ఈ వానల ఎఫెక్ట్ మెట్రో పిల్లర్లపైనా పడింది.

moosapet metro station damage

కుండపోత వర్షానికి మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో మార్గంలో మూసాపేట్ మెట్రోస్టేషన్ దగ్గర రోడ్డు భారీగా కుంగింది. వరద తాకిడికి మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సర్ఫెజ్ వాల్ ధ్వంసమైంది. సరిగ్గా పిల్లర్‌కు చుట్టూ వున్న రోడ్డు కుంగిపోవడంతో దాని ప్రభావం పిల్లర్‌పై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక పిల్లర్ చుట్టూ రోడ్డు కుంగిపోగా.. దాని పక్కనే వున్న మరో పిల్లర్ చుట్టూ కూడా సగం వరకు రోడ్డు కుంగిపోయింది. చుట్టూ రోడ్డు కుంగిన నేపథ్యంలో పిల్లర్ పటుత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంకోవైపు మూసాపేట్‌ దగ్గర వాహన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

నగరంలో రోడ్డు రవాణా వ్యవస్థ పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో మెట్రో రైలుపై ఆధారపడే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కాగా, రోడ్డు కుంగిన విషయాన్ని పలువురు మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పిల్లర్ చుట్టూ వున్న నీటిని తోడేసిన అధికారులు.. మరోసారి భారీ వర్షం వస్తే ఏంటని కంగారు పడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మెట్రో ఇంజనీర్లు ప్రస్తుతం మూసాపేట దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మెట్రో స్టేషన్ కు దగ్గరలోని చెరువు కట్ట తెగడం వల్లనే రోడ్డు కుంగిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.