Telangana Microsoft : తెలంగాణలో రూ.15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

Telangana Microsoft : తెలంగాణలో రూ.15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

Telangana Microsoft

Microsoft Telangana data centre hyderabad investment : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకుంటోంది. డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో తుది విడత చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే డేటా సెంటర్ ఏర్పాటుపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసే చాన్స్ ఉంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడుల విలువ కనీసం రూ.15వేల కోట్లు. ఈ ప్రాజెక్ట్ తో వందల సంఖ్యలో అదనపు ఉద్యోగాలను కల్పించడానికి వీలవుతుంది.

హైదరాబాద్‌లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు ఉన్నాయి. వందలాది మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు పని చేస్తున్నారు. దీనికి అదనంగా ఓ డేటా సెంటర్‌ను నెలకొల్పడానికి మైక్రోసాఫ్ట్ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్‌లో పెట్టబడులకు అనువైన వాతావరణం ఉండటం వల్ల దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పడానికి ఇప్పటికే తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖతో చర్చలు నిర్వహించింది.

బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిసి భారత్‌లో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పింది మైక్రోసాఫ్ట్. బీఏఎం డిజిటల్ రియాలిటీ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేయనుంది. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టెడ్ కూడా. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్లను నిర్మించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఇది కల్పిస్తుంది. మొత్తంగా ఐటీ సెక్టార్ లో పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి.