హరీష్ రావు గొప్ప మనసు, రూ.లక్ష వడ్డీ చెల్లించిన మంత్రి

హరీష్ రావు గొప్ప మనసు, రూ.లక్ష వడ్డీ చెల్లించిన మంత్రి

minister harish rao paid sarpanch interest: మంత్రి హరీష్ రావు ఏంటి మిత్తి(వడ్డీ) కట్టడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. నిజమే, ఆయన మిత్తి కట్టారు. అదీ ఓ సర్పంచ్ కి. అసలేం జరిగిందంటే.. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ హాజరయ్యారు. అక్కడ గ్రామ సర్పంచ్‌ నర్సమ్మ తన బాధను మంత్రి హరీశ్‌రావుతో పంచుకున్నారు. ఏడాది క్రితం గ్రామంలో రూ.5 లక్షల సీసీ రోడ్డు, జీపీ నిధుల ద్వారా మరో రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నిర్వహించి ఏడాది అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు మిత్తి కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికి రూ.95 వేల వరకు మిత్తి చెల్లించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సర్పంచ్‌ అయిన కొద్దిరోజులకే భర్త కిషన్‌ చనిపోయినప్పటికీ చెడ్డపేరు రావొద్దని అప్పు చేసి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో మంత్రి హరీష్ చలించిపోయారు. వెంటనే అధికారులతో మాట్లాడారు. బిల్లుల ఆలస్యానికి కారణమేంటని పంచాయతీ రాజ్‌ ఈఈ రామచంద్రారెడ్డి, ఏఈ విజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. బిల్లు మంజూరైనప్పటికీ బ్యాంకు ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ తప్పుగా కొట్టడంతో ఆలస్యమైందని సమాధానమిచ్చారు. దీంతో మంత్రి హరీష్ రూ.లక్ష నగదును సర్పంచ్‌కు అందించారు. అంతేకాదు బిల్లులు కూడా త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

తాను కట్టిన మిత్తిని మంత్రి ఇవ్వడంతో సర్పంచ్ ఆనందానికి లోనయ్యారు. కష్టాల్లో ఉన్న తనకు మంత్రి సాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు సైతం మంత్రిని ప్రశంసించారు. మంత్రి హరీష్ రావుది గొప్ప మనుసు అని కొనియాడారు.

హరీష్ రావు ప్రజా నాయకుడిగా గుర్తింపు ఉంది. సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు వెంటనే పరిష్కరించడంలో మంత్రి హరీష్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు బ్రహ్మరథం పట్టారు నియోజకవర్గ ప్రజలు. అలాంటి హరీష్ సర్పంచ్‌కు మిత్తి చెల్లించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారని స్థానికులు అభినందించారు.