రానున్న మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 03:04 PM IST
రానున్న మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్

minister ktr: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సోమ‌వారం(అక్టోబర్ 19,2020) ఉద‌యం జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఉన్న‌తాధికారులతో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను కేటీఆర్ స‌మీక్షించారు.

రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు:
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేటీఆర్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లతో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని సూచించారు. ముంపు ప్ర‌జ‌ల ఆశ్ర‌యం కోసం క‌మ్యూనిటీ, ఫంక్ష‌న్ హాల్స్‌ను సిద్ధం చేయాల‌ని చెప్పారు. నిరాశ్ర‌యుల కోసం అన్న‌పూర్ణ భోజ‌నం అందించాల‌న్నారు.

ముంపు ప్రాంతాల్లో ట్యాంక‌ర్ల ద్వారా నీరు అందించాలి. మొబైల్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంచాల‌ని అధికారులను ఆదేశించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించేందుకు త‌క్ష‌ణ‌మే 100 మంది సీనియ‌ర్ అధికారుల‌ను ప్ర‌త్యేక ఆఫీస‌ర్లుగా నియ‌మించాల‌ని మున్సిప‌ల్ శాఖ‌ను కేటీఆర్ ఆదేశించారు. 100 మంది ప్ర‌త్యేక ఆఫీస‌ర్లు.. రాబోయే 10 రోజులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ.. ఇత‌ర శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం:
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వర్షం పడే అవకాశం ఉన్నచోట ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. క్యుములో నింబస్‌ మేఘాలతో వానలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారన్నారు. ‘‘ వేలాది మందిని ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా 80 మంది అధికారులను నియమించాం. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

నెలకి సరిపడ రేషన్:
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 80 కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం 37వేల రేషన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కిట్ లో 11 రకాల వస్తువులు ఉన్నాయన్నారు. ‘‘ఒక్కో కిట్‌లో నెలకు సరిపడా నిత్యావసర సరకులు, దుప్పట్లు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశాం. అక్కడ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నియంత్రణకు, విద్యుత్‌ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టాం. ఇంకా 164 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాం’’ అని కేటీఆర్‌ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్‌ తెలిపారు.

వరద సహాయక చర్యల కోసం రూ.670 కోట్లు:
వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.60కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరో రూ.670 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరధిలో 33మంది చనిపోయారని తెలిపారు. 29మందిని గుర్తించిన ప్రభుత్వం, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు సాయం అందించామన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా శిథిలావస్థలో ఉన్న 187 భవనాలు కూల్చేశామన్నారు. గుర్రం చెరువు, పల్లె చెరువు, అప్పచెరువు తెగడం వల్ల భారీగా నష్టం జరిగిందన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురైన మాట వాస్తవమే అన్నారు కేటీఆర్. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టంతా ప్రజలను వరద నుంచి కాపాడటం పైనే ఉందన్నారు.

హైదరాబాద్ చరిత్రలో ఇలాంటి వర్షం కురవడం ఇది రెండోసారి:
హైదరాబాద్ చరిత్రలో ఇలాంటి వర్షం కురవడం రెండోసారి అని కేటీఆర్ చెప్పారు. ఈ ఏడాది(2020) జీహెచ్ఎంసీ పరిధిలో 80శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఇది వందేళ్లకు ఒకసారి వచ్చే అసాధారణ వర్షపాతం అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశానికి చిల్లుపడినట్లు రికార్డు స్థాయిలో వర్షం కురిసిందన్నారు. 1908 సెప్టెంబర్ లో ఒక్కరోజులో 43సెం.మీ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తు చేశారు. మళ్లీ వందేళ్ల తర్వాత అంత భారీ వర్షపాతం ఇప్పుడు నమోదైందన్నారు.

మళ్లీ వందేళ్ల తర్వాత అంత వర్షపాతం నమోదు:
ఒక్కరోజులో ఘట్ కేసర్ లో 32, చర్లపల్లిలో 30 సెంమీ వర్షపాతం నమోదైందన్నారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకూడదన్నదే మా ప్రయత్నం అని కేటీఆర్ చెప్పారు. 37వేల రేషన్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామన్న కేటీఆర్, ఇప్పటికే 18వేల కిట్లను పంపిణీ చేశామన్నారు. జీహెచ్ ఎంసీలో సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. అనేకమందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. సరైన సమయంలో చర్యలు తీసుకోవడంతో అధిక ప్రాణనష్టం తప్పిందన్నారు.

రానున్న మూడు నాలుగో రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కేటీఆర్ చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. 11 రకాల వస్తువులతో 37వేల రేషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

కట్టుబట్టలతో వస్తే చాలు అన్ని ఏర్పాట్లు చేస్తాం:
80మంది స్పెషల్ ఆఫీసర్లు 10 రోజుల పాటు సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. విద్యుత్ పునరుద్దరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు 920 ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మత్తులు పూర్తయ్యాయన్నారు. పీర్జాదిగూడ, పెద్ద అంబర్ పేట, నాగారం, బండ్లగూడ, ఆదిబట్ల, మీర్ పేట, తుర్కయాంజల్ లో నష్టం కొంచెం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితికి అందరూ బాధ్యులే అని కేటీఆర్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బాధితులు కట్టుబట్టలతో వస్తే చాలు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.