కాంగ్రెస్ ఉద్యోగాలివ్వలేదు…బీజేపీ ఐటీఐఆర్ ను అడ్డుకుంది..మంత్రి కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ఉద్యోగాలివ్వలేదు…బీజేపీ ఐటీఐఆర్ ను అడ్డుకుంది..మంత్రి కేటీఆర్ ఫైర్

minister-ktr

KTR angry with Congress and BJP : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ను అడ్డుకుంది బీజేపీనేనని విమర్శించారు. ఐటీఐఆర్ రాకుండా చేసిన బీజేపీకి తెలంగాణ యువత ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

బుధవారం (ఫిబ్రవరి 24, 2021) తెలంగాణ భవన్ లో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైల్వే కోచ్ కు భూములిచ్చినా ఇంత వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు.

అసత్య పునాదుల మీద బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కిందని విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ప్రశ్నించడం మాత్రమే కాదు పనిచేసే సత్తా ఉన్న నేతలకే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.

కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 24 వేలు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ వచ్చిన ఆరున్నరేళ్లలో లక్షా 32 వేల 799 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై ఎవరితో, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిన వారికి, టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందని వెల్లడించారు. దేశంలో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.