Minister KTR At Basara IIIT : రంగంలోకి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై స్పెషల్ ఫోకస్

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ ఐటీలో పర్యటించిన కేటీఆర్.. విద్యార్థులతో భేటీ అయ్యారు. హాస్టల్ లో మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు.

Minister KTR At Basara IIIT : రంగంలోకి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై స్పెషల్ ఫోకస్

Minister KTR At Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ ఐటీలో పర్యటించిన కేటీఆర్.. విద్యార్థులతో భేటీ అయ్యారు. హాస్టల్ లో మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. 12 డిమాండ్ల పరిష్కారంపై క్యాంపస్ అధికారులను వివరణ కోరాగా.. కేటీఆర్ కు ఇంచార్జి వీసీ వివరాలు అందించారు. అంతకుముందు ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్ లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.

మంత్రి వెంట ట్రిపుల్ ఐటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా విద్యార్థులతో కలిసి లంచ్ చేశారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ హాల్ లో ట్రిపుల్ ఐటీ పీయూసీ 1,2 ఈసీఈ-1 బ్యాచ్ విద్యార్థులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. మరోవైపు స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్(SGC) సభ్యులను కలిసేందుకు మంత్రి కేటీఆర్ నిరాకరించారు.

SGC ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాతే మంత్రితో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఫైర్ అయ్యారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి మంత్రి కేటీఆర్ ను కలిసే అవకాశం కల్పించాలని ఎస్జీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా క్యాంపస్ లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే క్యాంపస్ ప్రధాన గేటు వద్ద కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియాను ఈ క్యాంపస్ లోకి అనుమతించ లేదు.

సమస్యల పరిష్కారానికి విద్యార్థుల చేసిన పోరాటం తీరుని మంత్రి కేటీఆర్ అభినందించారు. మీరు పోరాటం చేసిన విధానం నాకు బాగా నచ్చిందన్నారాయన. విద్యార్థుల ఆందోళనను ప్రతీ రోజూ తాను గమనించానని చెప్పారు. రాజకీయాలకు తావివ్వకుండా సమస్యలపై విద్యార్థులే పోరాటం చేయడం తనకు నచ్చిందన్నారు కేటీఆర్. గాంధీజీ సత్యాగ్రహ దీక్ష చేసినట్లు.. విద్యార్థులు పోరాటం చేశారని చెప్పారు. విద్యార్థులు ప్రజాస్వామికంగా, పద్దతిగా ఆందోళన చేశారని మెచ్చుకున్నారు. రెండు నెలల్లో మళ్లీ బాసర ట్రిపుల్ ఐటీకి వస్తానన్న కేటీఆర్.. నవంబర్ లో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు.