విదేశాల్లో చదువు కోసం రూ.29 లక్షల విద్యారుణం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

విదేశాల్లో చదువు కోసం రూ.29 లక్షల విద్యారుణం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

minister ktr launch zilla parishad school in siricilla: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ సోమవారం(ఫిబ్రవరి 1,2021) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఈ పాఠశాలను నిర్మించడంతో సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింద‌న్నారాయన. పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించాల‌ని సూచించిన మంత్రి కేటీఆర్, త‌న త‌ల్లిదండ్రుల ప్రోత్సాహ‌మే త‌న‌ను ఇంత‌టివాడిని చేసింద‌ని తెలిపారు.

‌1960లో ఏర్పాటైన ఈ పాఠశాల ఎంతో మందిని ప్రయోజకులను చేసింద‌ని కేటీఆర్ అన్నారు. ప‌లు సేవా సంస్థ‌ల స‌హ‌కారంతో కరోనా సమయంలో ఈ పాఠశాల పునర్ నిర్మించామ‌ని తెలిపారు. 400మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, 39 తరగతి గదులతో భ‌వ‌నాన్ని నిర్మించామ‌న్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు వాలీబాల్, ఫుట్ బాల్ కోర్టులను నిర్మించారు. ఇక భద్రతా పరంగా ఎలాంటి రాజీ పడకుండా సీసీ కెమెరాలను భవనం చుట్టూ ఏర్పాటు చేశారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర‌ వ్యాప్తంగా ఏర్పాటు కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.

ఈ పాఠశాల నిర్మాణం ఎంతో గొప్పగా ఉందన్నారు కేటీఆర్. ఇక్కడ చదువుకునే పిల్లల కోసం, విద్యార్థుల కోసం ఏం చేసినా తక్కువే అన్నారాయన. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా సిరిసిల్ల పాఠశాల తయారు చేశారని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయ‌ని, అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు. గడిచిన ఆరేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు నెలకొల్పామని, ఒక్కో విద్యార్థి మీద 1.25లక్షలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు రూ.29 లక్షల విద్యా రుణం ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి మూడు కోట్లు ఖర్చు చేశారు. మంత్రి కేటీఆర్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు సమకూరాయి. 600మంది ఉన్న ఈ స్కూల్ 1960లో ప్రారంభమైంది. అయితే స్కూల్ పాతబడి భవనం శిదిలావస్థకు చేరింది. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని ఆధునిక భవన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకున్నారు. పాత భవనాలు కూల్చి మొత్తం 33 క్లాస్ రూమ్స్ తో సుమారు వెయ్యి మంది విద్యను అభ్యసించేలా నూతన భవనాన్ని నిర్మించారు. రూ.30లక్షలతో వాలీబాల్, ఫుట్ బాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. అత్యాధునిక లైబ్రరీ, సురక్షిత తాగునీరు, 50 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, అధునాతన సైన్స్ ల్యాబ్, 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ కొనియాడారు.