కేసీఆర్ మరో యాగం, తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు!

కేసీఆర్ మరో యాగం, తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు!

Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అక్కడి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. యాదాద్రిలో జరుగుతున్న పనులపై త్వరలోనే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం యాగం తేదీలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. యాగం తర్వాత..కేటీఆర్ కు సీఎం పదవి బాధ్యతలు అప్పగిస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. రెండు నెలల్లోపే ఈ ప్రక్రియ అంతా పూర్తయితుందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవి బాధ్యతలు చేపడుతారని టాక్ వినిపించింది. కానీ..జనవరి మొదటి వారం గడువు ముగిసినా..అలాంటిదేమి జరగలేదు. యాదాద్రి పునర్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గర్భగుడి మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా పనులు జనవరి నెలాఖరు వరకు పూర్తయితే..ఫిబ్రవరి నెలలో యాగాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.

యాగాలు, ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. యాగాల అనంతరం సీఎం పదవి బాధ్యతల నుంచి కేసీఆర్ తప్పుకుంటూ..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో ఖచ్చితంగా సీఎంగా కేటీఆర్ పదవి బాధ్యతలు తీసుకుంటారని అనుకుంటున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండే వారు దీనిని ధృవీకరిస్తున్నారు. అయితే..తేదీ మాత్రం ఎప్పుడు ఉంటుందనే స్పష్టతమైన సమాచారం రావడం లేదు.