దేశంలోనే ఫస్ట్ : వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్

దేశంలోనే ఫస్ట్ : వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్

satellite bus terminal in Vanasthalipuram : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఎల్‌బీనగర్‌ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శనివారం (జనవరి 9, 2021) మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. హెచ్ఎండీఏ.. రూ.10 కోట్లతో శాటిటైల్ బస్ టెర్మినల్ ను నిర్మిస్తోంది.

అంతర్‌ జిల్లాల బస్సుల రాకపోకల కోసం ఈ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఈ టెర్మినల్ నుంచి నల్లగొండ, ఖమ్మం, ఏపీ, తమిళనాడుకు బస్సులు వెళ్లనున్నాయి.
ఎల్‌బీనగర్‌ మీదుగా ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు ప్రతిరోజు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. దీంతో ఇక్కడ బస్సులు రోడ్డుపై ఆగడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకుగానూ సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్‌ బేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిటీలో బస్సుల రద్దీ తగ్గించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. అత్యాధునిక పద్ధతిలో 5 బస్సు బేలను నిర్మించనుంది. ప్రయాణికుల కోసం పార్కింగ్, ఏసీ వెయింటింగ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో హెచ్‌ఎండీఏ మూడు బస్‌ బేలను నిర్మించనుంది.

ప్రతి బస్‌ బేలో ఏసీతో కూడిన వెయిటింగ్‌ రూములతోపాటు ఫార్మసీ, బ్యాంకు, నీటి ఏటీఎంలు, ఎంక్వైరీ కేంద్రం, ఫుడ్‌ కోర్టులు, మరుగుదొడ్లు, బైకులు, కార్లు, ట్రక్కుల పార్కింగ్‌ కేంద్రాలతోపాటు లోకల్‌ బస్టాప్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది.