సంచార బయో టాయిలెట్లుగా పాత TS ఆర్టీసీ బస్సులు : ప్రారంభించిన మంత్రి

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 10:32 AM IST
సంచార బయో టాయిలెట్లుగా పాత TS ఆర్టీసీ బస్సులు : ప్రారంభించిన మంత్రి

మూలపడిపోయిన పాత బస్సులను కొత్త పద్ధతిలో ఉపయోగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పాత ఆర్టీసి బస్సలు కొత్త అవతారం ఎత్తాయి. సిటీల్లో సంచార బయో టాయిలెట్లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను ప్రారంభించగా..రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోని పాత బస్సులు సంచార బయో టాయ్ లెట్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతుండగా..ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) పట్టణాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం వీటిని ప్రారంభించిందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అవసరమైన చోట టాయిలెట్‌ ఆన్‌వీల్స్‌ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పాత ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటూ వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామనీ..ఈ సంచార బయో టాయిలెట్ల నిర్వాహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు.